‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు

Shrey Parikh Wins National Spelling Bee
  • 2026 టైటిల్‌ విజేతగా శ్రేయ్ పారిఖ్
  • 32 పదాలతో సరికొత్త రికార్డు
  • మూడోసారి పోటీపడి టైటిల్ కైవసం
  • భారత్‌తో బలమైన బంధం
  • మ్యాథ్స్‌కౌంట్‌ పోటీలకూ ఎంపిక
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘స్క్రిప్స్ నేషనల్ ‘స్పెల్లింగ్ బీ 2026’ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు శ్రేయ్ పారిఖ్ ఘన విజయం సాధించాడు. కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోకు చెందిన ఈ ఎనిమిదో తరగతి విద్యార్థి ‘స్పెల్-ఆఫ్’ రౌండ్‌లో ఏకంగా 32 పదాలను తప్పుల్లేకుండా చెప్పి సరికొత్త రికార్డు సృష్టించాడు. నిర్వాహకులు ఇచ్చిన ‘Bromocriptine’ అనే కఠినమైన పదాన్ని సరిగ్గా పలికి ఈ ఏడాది ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

మూడో ప్రయత్నంలో విజయం
శ్రేయ్ పారిఖ్‌కు ఈ పోటీ కొత్తేమీ కాదు. గతంలో 2022లో జరిగిన కాంపిటీషన్‌లో పాల్గొని 89వ స్థానంలో నిలిచాడు. తర్వాత 2024లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పట్టు వదలకుండా చేసిన కఠిన సాధనతో ఈ ఏడాది విజేతగా నిలిచి తన కల నెరవేర్చుకున్నాడు. స్పెల్లింగ్ బీ చరిత్రలోనే అత్యధికంగా 32 పదాలను సరిగ్గా చెప్పిన రికార్డు శ్రేయ్ పేరిట నమోదైంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో గత రెండు దశాబ్దాలుగా భారత సంతతి పిల్లలే ఎక్కువగా విజేతలుగా నిలుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.

చదువుతో పాటు
డే క్రీక్ ఇంటర్మీడియట్ స్కూల్‌లో చదువుతున్న శ్రేయ్‌కు కేవలం భాషలపైనే కాకుండా ఇతర రంగాల్లోనూ మంచి పట్టు ఉంది. టెన్నిస్ ఆడటం, పుస్తకాలు చదవడం, చదరంగం ఆడటం అతడికి ఇష్టమైన వ్యాపకాలు. పాఠశాల బ్యాండ్‌లో డ్రమ్స్, టింపానీ, మారింబా వంటి వివిధ రకాల వాయిద్యాలను వాయిస్తాడు. ఈ ఏడాది కాలిఫోర్నియా స్టేట్ ‘మ్యాథ్‌కౌంట్స్’ పోటీలకూ ఎంపికయ్యాడు. ఖాళీ సమయాల్లో అన్నదమ్ములతో గడపడంతో పాటు, భారతదేశంలోని తన తాతయ్య, అమ్మమ్మలను కలవడానికి ఇక్కడికి రావడమంటే శ్రేయ్‌కు ఎంతో ఇష్టం.
Go Back to Shorts
Shrey Parikh
Spelling Bee
Scripps National Spelling Bee 2026
Indian American
Bromocriptine
Spell-Off
California
MathCounts
Tennis
Student

More Telugu News