అధిక ఉష్ణోగ్రతలు.. సోలార్ హట్స్ ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం

  • షాలిమార్‌బాగ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
  • ఇది జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం
  • ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి నగరవ్యాప్తంగా ఏర్పాటు
వేసవి వేడిని తట్టుకోవడంలో ప్రజలకు సహాయపడే ప్రయత్నంలో భాగంగా, ఢిల్లీ ప్రభుత్వం నగరంలో సౌరశక్తితో నడిచే ఒక పబ్లిక్ కూలింగ్ స్ట్రక్చర్‌ను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీనిని షాలిమార్‌బాగ్‌లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సోలార్ హట్స్ ఏర్పాటు చేయాలనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చల్లదనాన్ని అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అన్నివైపులా గడ్డిని ఏర్పాటు చేస్తారు. స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉండటం వల్ల లోపల అంతా చల్లదనం పరుచుకుంటుంది. ప్రజలకు దీనివల్ల నీడతోపాటు చల్లదనం లభిస్తుంది. ఇది సోలార్ శక్తి మీద నడుస్తుంది. ఈ హట్స్‌లో ప్రజలు ఎండ సమయంలో విశ్రాంతి తీసుకోవచ్చు. పౌరులు లోపల కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే, చల్లటి మంచి నీరు అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు.

ఈ హట్స్ పైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం వల్ల దీని నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం షాలిమార్‌బాగ్‌లో ఈ హట్ నిర్మాణ దశలో ఉంది. రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభిస్తారు. దీనివల్ల కూలీలు, పాదచారులు, ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. దీనికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు.

Delhi Government
Delhi heatwave
solar huts
public cooling structure
Shalimar Bagh
heat relief

More Telugu News