పంచ్ ప్రభాకర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీజీ వెంకటేశ్
- ఆర్యవైశ్యుల గురించి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
- ప్రభాకర్ ను కటకటాల వెనుక పెట్టాలన్న టీజీ వెంకటేశ్
- రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపాటు
ప్రవాసాంధ్రుడు, వైసీపీ మద్దతుదారుడు అయిన పంచ్ ప్రభాకర్ ఆర్యవైశ్య కమ్యూనిటీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆర్యవైశ్య మహాసభ చైర్మన్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కర్నూలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పంచ్ ప్రభాకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు పెడతామని, అతడిని కటకటాల్లోకి నెట్టేవరకు ఆర్యవైశ్య సమాజం నిద్రపోదని ఆయన హెచ్చరించారు.
పంచ్ ప్రభాకర్ చేసిన అసత్య ఆరోపణలను నిరసిస్తూ రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. "రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సహజమే. కానీ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆర్యవైశ్య కమ్యూనిటీపై ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదు" అని ఆయన మండిపడ్డారు.
తన వ్యాఖ్యలను పంచ్ ప్రభాకర్ వక్రీకరించారని టీజీ వెంకటేశ్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. గతంలో రాయలసీమలో మీసాలు తిప్పుకుని తిరిగిన కొందరు నాయకులే, ఆ తర్వాత మీసాలు దించుకొని తన దగ్గరకు వచ్చారని మాత్రమే తాను అన్నానని గుర్తుచేశారు. అయితే, తాను అన్న మాటలను రెడ్డి సామాజికవర్గానికి ఆపాదిస్తూ పంచ్ ప్రభాకర్ మాట్లాడటం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని కొట్టిపారేశారు. రెండు కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టేందుకే ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నిజంగా ప్రభాకర్ అనే వ్యక్తికి అంత ధైర్యం ఉంటే, విదేశాల్లో దాక్కోవడం మానేసి ఇండియాకు రావాలి. ఆయన ఇక్కడికి వస్తే ఆర్యవైశ్యులే ఆయన్ను తన్నుకుంటూ తీసుకుపోతారు" అని టీజీ వెంకటేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్టపరంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.