ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన!
- సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీ
- జట్టులో ధోనీ ఏ పాత్రలో కొనసాగాలనుకున్నా తమకు అభ్యంతరం లేదన్న సీఈవో
- ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టీకరణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్కే అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్కే అనేంతలా ఆ జట్టుతో అతడి బంధం ముడిపడిపోయింది. అయితే, మోకాలి గాయం కారణంగా ధోనీ ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. దీంతో అతడి ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందనే చర్చలు క్రికెట్ వర్గాల్లో జోరందుకున్నాయి.
ఈ ఊహాగానాలపై సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఒక సంచలన ప్రకటన చేశారు. ధోనీ జట్టులో ఏ పాత్రలో కొనసాగాలనుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగత ఇష్టానికే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. "ధోనీ సీఎస్కేలో ఏ పాత్రలో ఉన్నా మాకు ఆనందమే. అతడు ఆటగాడిగా ఉంటాడా, కోచ్‌గా మారతాడా లేదా మెంటార్‌గా సేవలందిస్తాడా అనేది పూర్తిగా అతడి ఇష్టం. సీఎస్కేకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుంది" అని సీఈవో వెల్లడించారు.
ధోనీ ఇంకా తన రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, వచ్చే సీజన్ నాటికి అతడు సీఎస్కే మేనేజ్మెంట్లో లేదా సపోర్ట్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా, సీఎస్కే హెడ్ కోచ్ పదవికి ధోనీని మించిన అర్హుడు మరెవరూ లేరని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.