ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...!

India Ranks Among Top Food Exporting Countries
  • ప్రపంచ ఆహార ఎగుమతుల్లో అమెరికా, బ్రెజిల్, కెనడా ఆధిపత్యం
  • మొత్తం ఆహార ఎగుమతుల్లో సగం వాటా కేవలం 10 దేశాలదే
  • ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా నిలిచిన భారత్
  • భారీగా ఉత్పత్తి చేసినా, దేశీయ అవసరాలకే చైనా ప్రాధాన్యం
  • పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఆహార ఎగుమతులకు పెరుగుతున్న ప్రాధాన్యం
ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందిస్తున్న వ్యవసాయ ఎగుమతిదారుల జాబితాలో అమెరికా, బ్రెజిల్, చైనా అగ్రస్థానంలో నిలిచాయి. 2024 సంవత్సరానికి చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకింగులలో భారత్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా గొలుసు కొద్ది దేశాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, 2024లో 181.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 144.4 బిలియన్ డాలర్లతో బ్రెజిల్ రెండో స్థానం, 74.8 బిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక 45.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3.8 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసిన భారత్, ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో భారత్ వాటా 3 శాతంగా ఉంది.

ప్రపంచ ఆహార ఎగుమతుల మార్కెట్ విలువ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇందులో 80 శాతానికి పైగా వాటా కేవలం 30 దేశాలదే కావడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, కెనడా, మెక్సికో దేశాలు కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. పెరుగుతున్న రవాణా, ఎరువుల ఖర్చులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆహార ఎగుమతులు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను పండించే చైనా, అధికశాతం దేశీయ అవసరాలకే వినియోగించుకోవడం వల్ల ఎగుమతుల్లో వెనుకబడింది.

టాప్ 15 ఆహార ఎగుమతి దేశాలు 
ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ఆహార ఎగుమతిదారుల జాబితా ఇక్కడ ఉంది.
1. అమెరికా: 181.3 బిలియన్ డాలర్లు (12.1% వాటా) 
2. బ్రెజిల్: 144.4 బిలియన్ డాలర్లు (9.7% వాటా)
3. చైనా: 74.8 బిలియన్ డాలర్లు (5.0% వాటా) 
4. కెనడా: 66.3 బిలియన్ డాలర్లు (4.4% వాటా) 
5. మెక్సికో: 49.9 బిలియన్ డాలర్లు (3.3% వాటా) 
6. ఇండోనేషియా: 49.7 బిలియన్ డాలర్లు (3.3% వాటా) 
7. ఆస్ట్రేలియా: 45.8 బిలియన్ డాలర్లు (3.1% వాటా) 
8. భారత్: 45.5 బిలియన్ డాలర్లు (3.0% వాటా) 
9. థాయ్‌లాండ్: 41.8 బిలియన్ డాలర్లు (2.8% వాటా) 
10. ఫ్రాన్స్: 38.7 బిలియన్ డాలర్లు (2.6% వాటా) 
11. నెదర్లాండ్స్: 37.3 బిలియన్ డాలర్లు (2.5% వాటా) 
12. అర్జెంటీనా: 34.8 బిలియన్ డాలర్లు (2.3% వాటా) 
13. మలేషియా: 33.5 బిలియన్ డాలర్లు (2.2% వాటా) 
14. టర్కియే: 31.4 బిలియన్ డాలర్లు (2.1% వాటా) 
15. యునైటెడ్ కింగ్‌డమ్: 30.9బిలియన్ డాలర్లు (2.1% వాటా)
Go Back to Shorts
India
Agricultural Exports
Food Exports
WTO
United States
Brazil
China
Top Exporters
Global Trade
Agriculture

More Telugu News