‘యల్లమ్మ’కు అందుకే ఓకే చెప్పా.. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ వీడియో ఇదిగో!

  • హీరోగా తన అరంగేట్రంపై స్పందించిన డీఎస్పీ
  • 'యల్లమ్మ' సినిమాకు ఓకే చెప్పడానికి కారణం ఇదేనంటూ వెల్లడి
  • తన తండ్రి స్వగ్రామం వేదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న దేవి
  • చిన్నప్పటి జానపద కళలే స్ఫూర్తినిచ్చాయన్న సంగీత దర్శకుడు
  • వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నటుడిగా అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. వేణు యెల్దండి దర్శకత్వంలో ‘యల్లమ్మ’ అనే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే, ఒక అగ్ర సంగీత దర్శకుడిగా ఉండి నటన వైపు ఎందుకు అడుగులు వేశారనే దానిపై డీఎస్పీ స్వయంగా స్పందించారు. తను ఈ సినిమా చేయడానికి అంగీకరించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని మంగళవారం వెల్లడించారు.

ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తన తండ్రి స్వగ్రామమైన వెదురుపాకలో తాను పర్యటించిన దృశ్యాలను అందులో చూపించారు. "చిన్నప్పటి నుంచి జానపద కళల పట్ల నాలో ఆసక్తిని నింపిన అద్భుతమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇదే. మా ఊరిలో జరిగే 'అమ్మోరు జాతర' వేడుకలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. 'యల్లమ్మ'కు నేను ఎందుకు ఓకే చెప్పానో ఇదే కారణం" అని డీఎస్పీ పోస్ట్‌లో పేర్కొన్నారు.

చిన్నప్పుడు తన తండ్రి తమను చెన్నై నుంచి తరచూ ఈ గ్రామానికి తీసుకొచ్చేవారని, ఇక్కడి ప్రకృతి స్వచ్ఛతను ఆస్వాదించేలా చేశారని డీఎస్పీ గుర్తుచేసుకున్నారు. "మా మూలాలతో, మా వాళ్లతో సంబంధం కొనసాగేందుకు మేం ఇక్కడ అందమైన ఇల్లు కట్టుకున్నాం. సంస్కృతి, జానపద కళలు, దైవత్వం వంటి గొప్ప విషయాలను ఈ ఊరే నాకు నేర్పింది. అదే నాకు స్ఫూర్తినిచ్చింది" అని వీడియోలో వివరించారు. ఈ అనుబంధం కారణంగానే 'యల్లమ్మ' కథకు వెంటనే కనెక్ట్ అయినట్లు తెలిపారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు వేణు, డీఎస్పీ మధ్య తొలి సమావేశం ఏకంగా 8 గంటల పాటు సాగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో డీఎస్పీ 'పర్శి' అనే పాత్రలో కనిపించనుండగా, సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు.

Devi Sri Prasad
DSP
Yellamma
Venu Yeldandi
Dil Raju
Telugu Movie
Debut Movie
Folk Arts
Amboru Jatara
Vedurapaka

More Telugu News