ముమైత్ ఖాన్ కు పాకిస్థాన్ తో సంబంధం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తోంది?

Mumaith Khans Pakistani roots career and current business
  • ముమైత్ ఖాన్ తల్లిది తమిళనాడు.. తండ్రిది పాకిస్థాన్
  • ప్రమాదం కారణంగా సినిమాలకు దూరమైన ముమైత్ ఖాన్
  • ప్రస్తుతం మేకప్, స్టైలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ముమైత్

‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనగానే టక్కున గుర్తొచ్చే ముమైత్ ఖాన్... ఆ ఒక్క పాటతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్‌గా మారి, ఐదారేళ్ల పాటు టాలీవుడ్‌ను ఊపేసింది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అనేత రేంజ్ లో ఆమె క్రేజ్ సంపాదించుకుంది. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఒక్కసారిగా మాయమైపోయిన ముమైత్ అసలేమైపోయింది? ఆమెకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధం ఏంటి? అన్న ఆసక్తికర వివరాలను ఇప్పుడు చూద్దాం.


ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే అయినప్పటికీ, ఆమె కుటుంబానికి అంతర్జాతీయ నేపథ్యం ఉంది. ఆమె తల్లిది తమిళనాడు కాగా, తండ్రిది పాకిస్థాన్. ముమైత్ పుట్టిన తర్వాతే వారి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. చిన్నతనంలోనే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆకలి కష్టాలు అనుభవించిన ముమైత్... కేవలం 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం ప్రారంభించింది.

సినిమాల్లోకి రాకముందు ఆమె అసలు పేరు ముంతాజ్. ఇండస్ట్రీలోకి వచ్చాక 'ముమైత్ ఖాన్'గా మార్చుకుంది. తమిళ చిత్రం 'మజ్ను'తో కెరీర్ ప్రారంభించి, తెలుగులో 'స్వామి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఛత్రపతి, యోగి, మగధీర వంటి ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో పాటు ‘మైసమ్మ ఐపీఎస్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించింది.

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె జీవితాన్ని మార్చేసిన ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఒకానొక సందర్భంలో ముమైత్ దీనిపై స్పందిస్తూ... తాను కావాలని సినిమాలు మానేయలేదని, ప్రమాదవశాత్తు తన మెదడులోని 5 నరాలు చిట్లిపోయాయని వెల్లడించింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆమె ఏకంగా 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కోమా నుంచి కోలుకున్నాక కనీసం ఏడేళ్ల పాటు ఎలాంటి పనులు చేయకూడదని, చిన్న వస్తువు కూడా ఎత్తకూడదని డాక్టర్లు కఠినమైన ఆంక్షలు విధించారు. ఆ ఏడేళ్ల విరామంలో ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంది. "దేవుడే నన్ను ముమైత్ ఖాన్‌గా మార్చాడు, ఆయనే నా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు, దాన్ని నేను అంగీకరించాను" అని ముమైత్ గతంలో పేర్కొంది.


సినిమాలకు దూరమైన ఆ ఏడేళ్ల కాలంలోనే ముమైత్ ఒక కొత్త ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తను నటిగా బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్, మేకప్ కిట్స్, స్టైలింగ్ టీమ్స్‌ను ముంబై నుంచి హైదరాబాద్‌కు రప్పించాల్సి వచ్చేదని... అదే సేవలను హైదరాబాద్‌లోనే ఎందుకు అందుబాటులోకి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం దాన్నే తన పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకుంది.

మధ్యలో బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌లో పాల్గొన్నప్పటికీ... అప్పట్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం షో మధ్యలో నుంచి బయటకు వచ్చి, మళ్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత 49వ రోజు షో నుండి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఏవీ చేయకుండా, కేవలం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేస్తూ తన వ్యక్తిగత, వ్యాపార జీవితాన్ని కొనసాగిస్తోంది.


Go Back to Shorts
Mumaith Khan
Mumaith Khan movies
Mumaith Khan Bigg Boss
Item songs Telugu
Telugu cinema actress
Pakistan connection
Business woman Hyderabad
Mumaith Khan accident
Mumaith Khan family
Mumait Khan career

More Telugu News