భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు
- వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భారీ రద్దీ
- శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూలైన్లు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 89,399 మంది భక్తులు
వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఉదయం 7 గంటల సమయానికే ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 నుండి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుండి 5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు.
మరోవైపు, నిన్న ఒక్కరోజే మొత్తం 89,399 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 49,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.92 కోట్ల ఆదాయం సమకూరింది. నిన్న రికార్డు స్థాయిలో భక్తులకు 4.88 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే తిరుమలలోని టీటీడీ అంబులెన్స్, ఆసుపత్రి కేంద్రాలలో నిన్న 3,751 మంది భక్తులు వైద్య చికిత్సలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.