ఢిల్లీలో వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

CNG Price Hiked Again in Delhi NCR
  • ఢిల్లీలో కిలోపై రూ. 2 పెంచడంతో రూ. 83.09కి చేరిన రేటు
  • గత 11 రోజుల్లో సీఎన్‌జీ ధర రూ. 6 మేర పెంపు
  • ఇరాన్ యుద్ధం, సరఫరా అంతరాయాలే కారణమని అంచనా
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరను కిలోకు రూ. 2 మేర పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 83.09కి చేరింది. ఈ నెల‌ 15 నుంచి ఇప్పటివరకు సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

గత 11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఏకంగా రూ. 6 పెరిగింది. మే 15న కిలోపై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.

నిత్యావసరాలపై ప్రభావం చూపుతున్న ఇంధన ధరల పెరుగుదల
ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం, హ‌ర్మూజ్ జలసంధి వద్ద చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలే ఈ వరుస పెంపులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సీఎన్‌జీ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా సామాన్యులపైనా పడుతుంది. ఆటో, క్యాబ్ చార్జీలు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

ఇప్పటికే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.12 వుండగా, డీజిల్ రూ. 95.20 ఉంది. దీనికితోడు ఈ నెల ప్రారంభంలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా రూ. 3,071.50కి చేరడంతో హోటళ్లలో భోజనం కూడా ప్రియంగా మారింది. గతంలో ధరలు పెంచినప్పుడు ట్యాక్సీ యూనియన్లు నిరసన తెలిపినప్పటికీ, దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ధరలను నియంత్రించడం కష్టంగా మారింది.
Go Back to Shorts
CNG
CNG Price Hike
Delhi
Compressed Natural Gas
Fuel Price Hike
Petrol Price
Diesel Price
LPG Price
India Fuel Imports

More Telugu News