రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!

  • తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
  • వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతి
  • ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం!
  • పలుచోట్ల 46 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి.

మరోవైపు, రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఈ ఎండల తీవ్రతకు రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికంగా వరంగల్‌లో 20 మంది ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్‌లో 8 మంది ఉన్నారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నా, సోమవారం సాయంత్రం నల్లగొండ, వికారాబాద్‌, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కాగా, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

IMD
Monsoon
Heatwave
Telangana
India Meteorological Department
Weather Forecast
Heatwave Deaths
El Nino
Rainfall
Temperature

More Telugu News