జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం

ICMR National Institute of Nutrition Study Reveals Junk Food Risks for Hyderabad Youth
  • ఎన్ఐఎన్ పరిశోధనలో తేలిన చేదు నిజాలు
  • ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మూడు రెట్లు పెరిగిన ముప్పు
  • 12.5 శాతం విద్యార్థుల్లో ఇప్పటికే అధిక రక్తపోటు
  • ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ వల్లే ఈ అనారోగ్యం
  • చిన్న వయసు అలవాట్లే గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయి 
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీపీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

విద్యార్థులపై సర్వే
హైదరాబాద్‌లోని వివిధ కాలేజీలకు చెందిన 18 నుంచి 24 ఏళ్ల లోపు వయసున్న 311 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆహార అలవాట్లు, వారి రక్తపోటును శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 12.5 శాతం మంది యువత అప్పుడే అధిక రక్తపోటు (≥140/90 mmHg) సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఇంత చిన్న వయసులోనే బీపీ రావడం భవిష్యత్తులో గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంపముంచుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్
యువత ఎక్కువగా ఇష్టపడే బిస్కెట్లు, చాక్లెట్లు, ప్యాక్ చేసిన చిప్స్ వంటి స్నాక్స్, బ్రెడ్ ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ వంటి 24 రకాల ఆహార పదార్థాలపై ఈ పరిశోధన సాగింది. కేవలం రుచి, సులభంగా దొరకడం, తక్కువ ధరకే లభించడం వల్లే యువత వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఈ తరహా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారే బీపీ బారిన పడుతున్నట్లు స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ‘న్యూట్రియెంట్స్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

నిపుణుల హెచ్చరిక
పట్టణ ప్రాంత యువత ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడటం పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతదేశంలో పోషకాహార మార్పులు వేగంగా జరుగుతున్నాయని, చిన్న వయసులో తీసుకునే ఆహార నిర్ణయాలే భవిష్యత్తులో వారి గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయని స్పష్టం చేశారు.
Go Back to Shorts
ICMR National Institute of Nutrition
Hyderabad youth
high blood pressure
junk food effects
packaged foods
ICMR NIN study
student health
nutrition research
heart disease risk
processed foods

More Telugu News