త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు 3 గంటలు సెలూన్‌లో!

  • మృతికి కొన్ని గంటల ముందు సెలూన్‌లో కనిపించిన త్విషా శర్మ
  • దాదాపు మూడు గంటల పాటు సెలూన్‌లో గడిపినట్లు ఫుటేజ్‌లో రికార్డ్
  • కోడలి సెలూన్ వివరాలపై పదేపదే ఆరా తీసిన అత్త గిరిబాలా సింగ్
  • లాయర్లమంటూ వచ్చి ఫుటేజ్ తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
మోడల్ త్విషా శర్మ మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఒక సెలూన్‌లో దాదాపు మూడు గంటల పాటు గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేలింది. వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ఈ కొత్త పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే... ఈ నెల‌ 12న భోపాల్‌లోని అత్తింటిలో త్విషా శర్మ ఉరివేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు మధ్యాహ్నం 3:12 గంటలకు ఆమె స్థానికంగా ఉన్న ఒక సెలూన్‌కు వెళ్లారు. అక్కడ హెడ్ మసాజ్, పెడిక్యూర్ చేయించుకుని సాయంత్రం 6:15 గంటలకు బయటకు వచ్చారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ వివరాలను సెలూన్ యజమాని కిరణ్ పరిహార్ ఎన్డీటీవీకి వెల్లడించారు. త్విషా మరణించిన మరుసటి రోజు ఉదయం ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి అయిన గిరిబాలా సింగ్ తనకు ఫోన్ చేశారని కిరణ్ తెలిపారు. త్విషా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్లింది, డబ్బులు ఎలా చెల్లించింది? వంటి వివరాలు అడిగారని చెప్పారు. త్విషా సోదరుడి పెళ్లి కోసం ఫిబ్రవరిలోనే ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకుందని, అందుకే ఆ రోజు డబ్బులు చెల్లించలేదని తాను చెప్పినట్లు కిరణ్ వివరించారు.

అదే రోజు మధ్యాహ్నం గిరిబాలా మరోసారి ఫోన్ చేసి, త్విషా ఆత్మహత్య చేసుకుందని చెప్పారని కిరణ్ పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లాయర్ల తరహా దుస్తులు ధరించిన ఐదారుగురు వ్యక్తులు సెలూన్‌కు వచ్చి, పోలీసులకు ఫుటేజ్ కావాలంటూ తీసుకెళ్లారని తెలిపారు. అయితే, వారి గుర్తింపు ఇప్పటికీ తెలియకపోవడం కేసులో మిస్టరీని పెంచుతోంది.

నోయిడాకు చెందిన త్విషా శర్మ, భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ తనను వరకట్నం కోసం మానసికంగా వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఆత్మహత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినా, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు రెండోసారి పోస్ట్‌మార్టమ్‌కు అనుమతి ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. పది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న త్విషా భర్త సమర్థ్ సింగ్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

Twisha Sharma
Twisha Sharma death case
Bhopal
dowry harassment
Giribala Singh
Samarth Singh
CCTV footage
salon
Madhya Pradesh High Court
second postmortem

More Telugu News