భూమి ఇతరుల పేరుమీదకు మారిందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నారై నిరసన

  • జిన్నారం మండలం పరిధిలోని శివనగర్ గ్రామవాసి రవిశంకర్ నిరసన
  • 2007లో భూమి కొనుగోలు చేసి పాసు పుస్తకాలు తీసుకుని అమెరికా వెళ్లిన రవిశంకర్
  • ఆ తర్వాత మరొకరి పైకి తన భూమి మారినట్లు గుర్తించిన రవిశంకర్
  • అమెరికా నుంచి వచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తన వ్యవసాయ భూమి రికార్డుల్లో ఇతరుల పేరు మీదకు మారిందని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఒక ఎన్నారై నిరసనకు దిగారు. జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రవిశంకర్ 2007లో సర్వే నెంబర్ 172లో 14 గుంటల భూమిని కొనుగోలు చేశారు. పాసు పుస్తకాలు తీసుకున్న అనంతరం ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఆ భూమిని మల్లమ్మ అనే పేరుపైకి రెవెన్యూ అధికారులు మార్చినట్లు తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి గ్రామానికి వచ్చారు.

గత ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తమ భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. దీంతో ఆయన తాజాగా జిన్నారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

తన భూమి ఇతరుల పేరు మీదకు మారిందని, తన భూమిని తన పేరు మీదకు మార్చే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు. జూన్ మొదటి వారంతో తన అమెరికా వీసా గడువు ముగియనుందని, తాను తిరిగి వెళ్లవలసి ఉంటుందని అన్నారు. కానీ తన భూమి కోసం తాను ఇక్కడే ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. ఆయన సమస్యపై ఆర్డీవో స్పందించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రవిశంకర్ ఆందోళన విరమించారు.

Ravishankar
Sangareddy
Telangana
Land Dispute
Revenue Department
Tahsildar Office
Shivnagar

More Telugu News