పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్

Kranthi Criticizes Jagan Over Political Culture in AP
  • తమిళనాడులో కొత్త సీఎం విజయ్ మంచి సంప్రదాయం మొదలుపెట్టారని ప్రశంస
  • ఏపీలో వైఎస్ జగన్ వల్లే శత్రుత్వ రాజకీయాలు పెరిగాయని విమర్శ
  • అవమానం జరగకపోయినా జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్న
  • కుట్ర రాజకీయాలు మాని ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్‌కు హితవు
  • పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని హెచ్చరిక
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె, జనసేన పార్టీ నేత క్రాంతి.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడులో నెలకొన్న కొత్త రాజకీయ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రి అయిన విజయ్, ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇంటికి వెళ్లి గౌరవించడం ద్వారా ఒక గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని క్రాంతి ప్రశంసించారు. ఒకప్పుడు శత్రుత్వ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న తమిళనాట ఇప్పుడు మార్పు వచ్చిందని వెల్లడించార. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో శత్రుత్వ రాజకీయాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విశ్లేషించారు.

ఈ సందర్భంగా గత ఘటనలను ఆమె గుర్తుచేశారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు అవమానం జరిగినప్పుడు, ఆమె ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి నెరవేర్చుకున్నారని తెలిపారు. అదేవిధంగా, జగన్ పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా అవమానించారని, దాంతో ఆయన కూడా 'ఈ కౌరవ సభ'లో అడుగుపెట్టనని శపథం చేసి, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. అయితే, జగన్‌కు ఎలాంటి అవమానం జరిగిందని ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధిగా జీతం తీసుకుంటూ సభకు డుమ్మా కొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

జగన్ తన ఓటమిని సమీక్షించుకోకుండా, కాపులను రెచ్చగొట్టడం, పవన్ కల్యాణ్‌ను కూటమి నుంచి ఎలా బయటకు తీసుకురావాలా అని కుట్ర రాజకీయాలు చేయడంపైనే దృష్టి పెట్టారని క్రాంతి ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ఇలాంటి రాజకీయాలు మాని, బాధ్యతగల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే ఘోరమైన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
Go Back to Shorts
Kranthi
Mudra gada Kranthi
Jagan Mohan Reddy
YS Jagan
Chandrababu Naidu
Tamil Nadu CM
Vijay Stalin
AP Politics
Andhra Pradesh Assembly
Janasena Party

More Telugu News