మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్

Nara Lokesh Remarks on SAEL Solar Project in Jammalamadugu
  • జమ్మలమడుగులో రూ.3 వేల కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్
  • ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య
  • మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే, మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు
  • రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి
  • బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి
ఒక ప్రాజెక్టు ప్రారంభమవ్వడమంటే కేవలం రిబ్బన్ కటింగ్ కాదని, అది దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణల కలయిక అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ, "మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్ అయితే... మీ బ్రాండ్ గొడ్డలి" అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

రాష్ట్రం చూపు.. జ‌మ్మ‌ల‌మ‌డుగు వైపు

రికార్డు సమయంలో ఎస్ఏఈఎల్ ప్రాజెక్టు పూర్తి కావడం స్థానిక రైతుల, జమ్మలమడుగు యువత విజయమని లోకేష్ ప్రశంసించారు. "మీ సహకారం వల్లనే ఈ భారీ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లో పూర్తయింది. ఈరోజు రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఇక్కడ మెగా సోలార్ పార్క్, అదానీ, చింతా గ్రీన్, జెన్‌కో–ఎన్టీపీసీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు ఎస్ఏఈఎల్ ను కూడా తీసుకువచ్చింది మనమే. కంపెనీలు తేవాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది బ్రాండ్ సీబీఎన్‌కే సాధ్యం" అని లోకేష్ అన్నారు.

విజ‌యానికి మూడు సూత్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన విజయవంతం కావడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. "మొదటిది – బ్రాండ్ సీబీఎన్. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకత్వం ఉండటంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. రెండవది – స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వేగంగా నిర్ణయాలు తీసుకుని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం మా విధానం. ఈ ప్రాజెక్టే దానికి నిదర్శనం. మూడవది – డ‌బుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ స‌ర్కార్‌. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోంది" అని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంతో పోటీపడే ఎకోసిస్టమ్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని లోకేష్ తెలిపారు. "ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచంతో పోటీపడే ఎకోసిస్టమ్‌లను నిర్మిస్తున్నాయి" అని ఆయన వివరించారు.

ఎస్ఏఈఎల్ తో తొలి పరిచయం

ఎస్ఏఈఎల్ సంస్థతో తన తొలి పరిచయాన్ని లోకేష్ గుర్తుచేసుకున్నారు. "ఢిల్లీలో ఒక టెలికాం ఆపరేటర్ల సమావేశంలో ఎస్ఏఈఎల్ నాయకత్వాన్ని కలిశాను. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై వారికున్న ఉత్సాహం, దీర్ఘకాలిక ప్రణాళిక నన్ను ఆకర్షించింది. వారి తపనను నేను వెంటనే గ్రహించగలిగాను" అని ఆయన నాటి సంఘటనను వివరించారు.

స్థానిక సమాజంతో మమేకం

పంజాబ్ కేంద్రంగా పనిచేసే ఒక కంపెనీ ఏపీలో విజయవంతం కాగలదా అనే సందేహం మొదట కలిగిందని, కానీ ఎస్ఏఈఎల్ బృందం క్షేత్రస్థాయిలో స్థానిక సమాజంతో మమేకమై పనిచేయడం చూశాక ఆ సందేహం తొలగిపోయిందని లోకేష్ అన్నారు. "వారు రైతులు, గ్రామస్థులు, అధికారులు, కార్మికులతో కలిసికట్టుగా పనిచేసి, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగారు. ఆ స్ఫూర్తే ఈ ప్రాజెక్టు విజయానికి కారణం," అని ఆయన ప్రశంసించారు.

రికార్డు వేగంతో ప్రాజెక్టు పూర్తి

SAEL సంస్థ రూ.3,000 కోట్ల పెట్టుబడితో, 2,400 ఎకరాల విస్తీర్ణంలో రెండు భారీ 300 మెగావాట్ల ప్రాజెక్టులను కేవలం 11 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిందని లోకేష్ తెలిపారు. పంజాబ్, రాజస్థాన్‌లోని ఎస్ఏఈఎల్ సొంత ప్లాంట్లలో తయారైన 12 లక్షలకు పైగా అత్యాధునిక సోలార్ మాడ్యూళ్లను ఈ ప్రాజెక్టులో వినియోగించారు.

పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఎగుమతి

ఈ ఒక్క ప్రాజెక్టుతోనే ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చని అంచనా. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 25 ఏళ్ల ఒప్పందం ప్రకారం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. "ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు, దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోంది. భారతదేశ హరిత ఇంధన విప్లవానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది," అని లోకేష్ స్పష్టం చేశారు. ఎస్ఏఈఎల్ బృందాన్ని ఉద్దేశించి "తుస్సీ కమాల్ కర్ దిట్టా... చక్ దే ఫట్టే!" అంటూ పంజాబీలో అభినందించారు.

ఉపాధి, భవిష్యత్ భరోసా

ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని, వీరిలో 80 శాతం స్థానికులేనని లోకేష్ చెప్పారు. 760 మంది రైతులకు దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ఎస్ఏఈఎల్ చేపడుతోందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎస్ఏఈఎల్ సంస్థకు ఎలాంటి మద్దతు కావాలన్నా తాను ఒక వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్ఏఈఎల్ కో-ఫౌండర్ సుఖ్ భీర్ సింగ్, సీఈవో లక్షిత్ ఆవ్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Go Back to Shorts
Nara Lokesh
AP Minister
Sukhbir Agro Energy Limited
SAEL
Solar Power Project
Jammalamadugu
Andhra Pradesh
CBN
Renewable Energy
Green Energy

More Telugu News