చిరంజీవి అభిమానులకు దర్శకుడు బాబీ లేఖ

  • ఘనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం
  • క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
  • మెగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి దర్శకుడు బాబీ ఎమోషనల్ ట్వీట్
  • పాత, కొత్త తరం ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని హామీ
  • మెగాస్టార్ రాంపేజ్‌కు సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న 158వ చిత్రం గురువారం హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతరం దర్శకుడు బాబీ, మెగా అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత లేఖను విడుదల చేశారు. బ్లాక్‌బస్టర్ విజయం అందిస్తానని, ఇదే తన హామీ అని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బాబీ తన ఎక్స్ ఖాతాలో అభిమానులకు సందేశమిచ్చారు. "డియర్ సహ అభిమానులారా" అంటూ పోస్ట్ మొదలుపెట్టిన బాబీ, తాను కూడా చిరంజీవికి వీరాభిమానినేనని స్పష్టం చేశారు. "ఈ రోజు మీరు చూపిన ప్రేమ, ఉత్సాహం నన్ను కదిలించింది. దాంతో పాటే నాపై బాధ్యత కూడా పెరిగింది" అని పేర్కొన్నారు.

"మనం ఆరాధించే మెగాస్టార్‌ను, తరతరాలుగా మెచ్చుకునే గొప్ప నటుడిని గౌరవించేలా ఒక మంచి సినిమా తీయాలన్నదే మా ఉద్దేశం. పాత తరం అభిమానులను, కొత్త తరం ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రం ఉంటుంది. మెగా రాంపేజ్‌కు సిద్ధంగా ఉండండి" అని బాబీ తన లేఖలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chiranjeevi
Bobby Kolli
Mega Star
Chiranjeevi 158
Pawan Kalyan
Nagababu
Telugu cinema
Tollywood
Mega fans

More Telugu News