'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కేజీలు తగ్గారు.. పాలిపోయి కనిపించడంతో భ‌య‌ప‌డ్డా: ప్రశాంత్ నీల్

Director Prashanth Neel Reveals How Jr NTR Lost 15 Kg In Four Months For Dragon
  • 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్రా చర్చ
  • పాత్ర కోసం 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడని వెల్లడించిన ప్రశాంత్ నీల్
  • ఎన్టీఆర్ బరువు తగ్గడంపై ఆయన కుటుంబసభ్యులు తనపై అసంతృప్తిగా ఉన్నారన్న దర్శకుడు
  • కండరాల బరువు తగ్గించేందుకు ప్రత్యేక శిక్షణ, తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకున్న తారక్
  • షూటింగ్ ప్రారంభానికి ముందు కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'డ్రాగన్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ చూడని ఉగ్రమైన అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా, దీని వెనుక తారక్ పడిన కఠోర శ్రమ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఒక చిన్న సూచనకే 15 కిలోలు తగ్గారు
ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. 'డ్రాగన్' పాత్ర కోసం ఎన్టీఆర్ కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కిలోల బరువు తగ్గారని తెలిపారు. "దాదాపు ఏడాదిన్నర క్రితం, షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఒక లుక్ టెస్ట్ చేశాం. ఆ సమయంలో ఈ పాత్ర కోసం ఆయన ఇంకాస్త సన్నగా, పదునుగా కనిపిస్తే బాగుంటుందని నేను సూచించాను. హంతకుడి పాత్ర కాబట్టి కొద్దిగా బరువు తగ్గితే బాగుంటుందని చెప్పాను" అని నీల్ గుర్తుచేసుకున్నారు.

ఆపమని చెప్పినా ఆయన ఆగలేదు
అయితే, తన చిన్న సూచనకు ఎన్టీఆర్ ఊహించని రీతిలో స్పందించారని నీల్ వివరించారు. "ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఆయన షూటింగ్‌కు రాలేదు. ఒకానొక దశలో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఆయన పాలిపోయి, బలహీనంగా కనిపించడం మొదలుపెట్టాక చాలాసార్లు ఆపమని చెప్పాను, కానీ ఆయన ఆగలేదు" అని నీల్ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కుటుంబసభ్యులు సైతం ఆందోళన 
ఈ తీవ్రమైన బరువు తగ్గుదల ఎన్టీఆర్ కుటుంబసభ్యులను సైతం ఆందోళనకు గురిచేసిందని ప్రశాంత్ నీల్ తెలిపారు. "ఆయన భార్య, తల్లి, స్నేహితులు.. అందరూ నాపై కోపంగా ఉన్నారు. చివరకు నా టీమ్ కూడా నాతో అసంతృప్తిగా ఉంది. కానీ, నేను కేవలం కొద్దిగా బరువు తగ్గమని మాత్రమే చెప్పాను. ఆయనే దానిని తీవ్రంగా తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన చాలా బాధపడటం మేం చూశాం. ఆ నింద అంతా నాపైనే పడింది" అని నీల్ వివరించారు.

అయితే, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా చాలా ప్రొఫెషనల్‌గా జరిగిందని నీల్ స్పష్టం చేశారు. తాను బరువు తగ్గాలని సూచించిన 30 నిమిషాల్లోనే ఎన్టీఆర్ ట్రైనర్ అక్కడికి వచ్చారని, మరుసటి రోజు ఉదయం నుంచే ప్రక్రియ మొదలుపెట్టారని చెప్పారు. ఇందుకోసం షూటింగ్‌ను కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చినా, చివరికి వచ్చిన ఫలితం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని నీల్ తెలిపారు.

9.5 కిలోల కండరాల బరువు ఎలా తగ్గించారు?
గతంలో ఎన్టీఆర్ ట్రైనర్ కుమార్ మన్నవ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న సాంకేతిక అంశాలను వివరించారు. కేవలం బరువు తగ్గడం కాకుండా, శరీరాన్ని మరింత చురుకుగా, నాజూగ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. దీనికోసం, కండలు పెంచే భారీ వర్కౌట్లకు బదులుగా, ఫంక్షనల్ మూమెంట్స్, కార్డియో ఆధారిత వ్యాయామాలపై దృష్టి సారించారు. రోజూ ఉదయం 45 నుంచి 90 నిమిషాల పాటు ఈ ప్రత్యేక శిక్షణ సాగింది. అంతేగాక‌ సాధారణంగా కండలు పెంచడానికి ఉపయోగించే అధిక ప్రొటీన్ డైట్‌కు బదులుగా, ఎన్టీఆర్ తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకున్నారు. ఈ వ్యూహం ద్వారానే కండరాల బరువును తగ్గించుకుని, పాత్రకు అవసరమైన లీన్ లుక్‌లోకి మారగలిగారు. మొత్తంమీద, ఎన్టీఆర్ అంకితభావం, ప్రశాంత్ నీల్ విజన్ కలిసి 'డ్రాగన్' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Go Back to Shorts
NTR Dragon
Jr NTR
Prashanth Neel
NTR weight loss
Dragon movie
NTR new look
Telugu cinema
Kumar Mannava
NTR trainer
Tollywood

More Telugu News