టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి

  • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముగిసిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం
  • మహానాడులో 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
  • కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న సోమిరెడ్డి

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో... ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు నిర్వహించబోయే ఈ వార్షిక పండుగలో మొత్తం 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించినట్లు కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణకు సంబంధించి రెండు తీర్మానాలు, అలాగే మహానాడు చరిత్రలోనే తొలిసారిగా అండమాన్ తెలుగు ప్రజల సమస్యలపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతుండటం విశేషం.


ఈ సందర్భంగా వైసీపీ పాలనపై సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి మారుపేరుగా మారిందని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పౌరులందరూ పూర్తి స్వేచ్ఛతో జీవిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మంత్రి లోకేశ్ కృషి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోడ్పాటు, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించామని కొనియాడారు. వాస్తవానికి ఈసారి మహానాడును నెల్లూరులో ఘనంగా నిర్వహించాలనుకున్నప్పటికీ, ప్రభుత్వం అనుసరిస్తున్న పొదుపు చర్యల్లో భాగంగానే ఎన్టీఆర్ భవన్ వేదికగా హైబ్రిడ్ (ఆన్‌లైన్ - ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించనున్నామని సోమిరెడ్డి వివరించారు.


Somireddy Chandramohan Reddy
TDP Mahanadu
Andhra Pradesh
Telangana
Andaman
Nara Lokesh
Chandrababu Naidu
Pawan Kalyan
TDP
YSRCP

More Telugu News