ఇండియన్‌ సినిమా చూపించేందుకు థియేటర్‌ అద్దెకు తీసుకున్న పాక్‌ టెక్కీ.. ఎందుకో తెలుసా?

  • ‘3 ఇడియట్స్’ స్క్రీనింగ్ కోసం అద్దెకు థియేటర్‌
  • శాన్‌ఫ్రాన్సిస్కోలో 250 సీట్ల థియేటర్ బుక్‌
  • పాక్‌ సంతతికి చెందిన టెక్కీ ప్రకటన
  • నిరాశలో ఉన్నవారిలో స్పూర్తి నింపేందుకు
జీవితంలో బోర్ కొట్టి, ఏం చేయాలో తెలియక నిరాశలో ఉన్నవారిలో జోష్‌ నింపేందుకు సిద్ధమయ్యాడు పాకిస్థాన్‌ సంతతికి చెందిన ఓ టెక్కీ. అందుకోసం సినిమాను మాధ్యమంగా ఎంచుకున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న 250 సీట్ల థియేటర్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘3 ఇడియట్స్’ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న ఫర్జా మజీద్ అనే ఈ టెక్ ఫౌండర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘జీవితంలో కొత్త ఇన్‌స్పిరేషన్ కావాలనుకునే వారు లేదా కాసేపు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలనుకునే వారు ఈ సినిమాకు రావచ్చు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏం చేయాలనే సందిగ్ధత చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన సినిమా ఇది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక ప్రదర్శన మే 24న శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ ‘మెరీనా థియేటర్’లో జరగనుంది. నాన్-ఇండియన్స్‌కు కూడా అర్థమయ్యేలా దీనికి ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి. ఒక్కో టికెట్ ధరను 10 డాలర్లుగా నిర్ణయించామని మజీద్ వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ సినిమాపై, దానిలోని ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘3 ఇడియట్స్‌’ సినిమా 2009లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చింది. ఆమిర్ ఖాన్, ఆర్.మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో కనిపించారు. చదువుల ఒత్తిడిని, జీవిత పరమార్థాన్ని కామెడీతో చూపించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుందీ చిత్రం. ఈ సినిమా స్ఫూర్తితోనే దక్షిణాదిన శంకర్ దర్శకత్వంలో 'నన్బన్' (తెలుగులో స్నేహితుడు) చిత్రం వచ్చింది. ఇందులో విజయ్ (ప్రస్తుత తమిళనాడు సీఎం), జీవా, శ్రీరామ్ నటించారు. 

Farza Majeed
3 Idiots
Bollywood movie
San Francisco
Marina Theater
Indian cinema
Aamir Khan
Rajkumar Hirani
Movie screening
Pakistani techie

More Telugu News