రేవంత్ రెడ్డి బీజేపీలో చేరొచ్చు: ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

  • పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో రేవంత్‌ను పోల్చిన ఎంపీ
  • మోదీ పిలుపు వెనుక ఆంతర్యం ఇదేనని వ్యాఖ్య
  • కాంగ్రెస్ సీనియర్లను కాదని రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చారని విమర్శ
  • రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియదని వ్యాఖ్యానించిన అరవింద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందేమోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధాని మోదీ ‘రేవంత్‌ గారూ.. నాతో కలవండి’ అని చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదే కావచ్చని ఆయన జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారిలాగే రేవంత్ కూడా పార్టీ మారొచ్చని ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు.

సోమవారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్ మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ, రేవంత్‌ల మధ్య ఏదైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. నేను బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే’’ అని ఆయన అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చి, కాంగ్రెస్ అధిష్ఠానం సొంత పార్టీ సీనియర్లను మోసం చేసిందని అరవింద్ ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు లాంటి వారికి సీఎం పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రేవంత్ ఎప్పుడు ఎటువైపు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అరవింద్ ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే, మరో పదేళ్ల పాటు నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని రేవంత్ చెప్పకనే చెప్పారని విశ్లేషించారు.  

Revanth Reddy
Dharmapuri Arvind
BJP
Telangana Politics
Narendra Modi
Congress Party
Nizamabad
Telangana CM
Komatireddy Venkat Reddy
Sridhar Babu

More Telugu News