అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!

  • అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్
  • సియాటిల్ మార్కెట్లలో గంటల వ్యవధిలోనే అమ్ముడైన కేసర్ రకం
  • బాక్సు ధర రూ. 5 వేలు అయినా కొనేందుకు ఎగబడుతున్న అమెరికన్లు
  • 'మ్యాంగో డిప్లమసీ' అంటూ భారత కాన్సులేట్ జనరల్ వ్యాఖ్య
  • కఠిన నిబంధనల మధ్యే పెరుగుతున్న మామిడి ఎగుమతులు
అమెరికాలో భారత మామిడి పండ్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రుచిలో రారాజులైన ఆల్ఫాన్సో, కేసర్ వంటి రకాల కోసం అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లోని సియాటిల్ సూపర్ మార్కెట్లలోకి వచ్చిన కేసర్ మామిడి పండ్లు కేవలం కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికన్లు ఇప్పుడు మామిడి ప్రియులుగా మారుతున్నారు.

ఈ మామిడి పండ్లను అమెరికాకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సియాటిల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా, దీనిని "మ్యాంగో డిప్లమసీ (మామిడిపండ్ల దౌత్యం)"గా అభివర్ణించారు. ఒక బాక్సు (సుమారు 12 పండ్లు) ధర 60 డాలర్ల (దాదాపు రూ. 5,000) వరకు పలుకుతున్నా, డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఆసక్తికరంగా, అధిక ధర ఉన్నప్పటికీ వీటిని భారతీయుల కంటే అమెరికన్లే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. భారత్ నుంచి బయల్దేరకముందే ఈ బాక్సులు అమ్ముడైపోతున్నాయని, వాటిని ముందే బుక్ చేసుకుంటున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.

ఒకప్పుడు పురుగుల సమస్యల కారణంగా 1989 నుంచి 2007 వరకు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు అమెరికా భారత మామిడి పండ్లపై నిషేధం విధించింది. 2006లో జరిగిన భారత్-అమెరికా అణు ఒప్పందం చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చి, 2007లో నిషేధం ఎత్తివేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆల్ఫాన్సో మామిడిని రుచి చూసి అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ప్రస్తుతం కఠినమైన నాణ్యతా నిబంధనలు, అధిక రవాణా ఖర్చులు ఉన్నప్పటికీ, అమెరికాకు భారత మామిడి ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ అరుదైన లభ్యతే భారత మామిడి పండ్లను అక్కడ ఒక ప్రీమియం ఉత్పత్తిగా మార్చింది.

Prakash Gupta
Indian mangoes
mango diplomacy
alphonso mangoes
kesar mangoes
US import
mango export
India-US trade
Seattle
Washington

More Telugu News