కిడ్నీ వ్యాధికి హైబీపీ ముందస్తు హెచ్చరికా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

High BP A Sign of Kidney Problems Doctors Warn
  • కిడ్నీలు దెబ్బతింటే రెనిన్‌ హార్మోన్‌ విడుదల
  • ఇది రక్తంలో ఉప్పు, నీరు పేరుకుపోయేలా చేస్తుంది
  • ఫలితంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి
  • దీంతో బీపీ పెరుగుతుంది
  • ఈ లక్షణాలు ఉంటే అలర్ట్‌ అవ్వాల్సిందే 
అధిక రక్తపోటు (హై-బీపీ) అనగానే చాలామంది గుండె సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా జీవనశైలి లోపాల వల్లే అనుకుంటారు. కేవలం బీపీ రీడింగ్స్ చూసుకుంటూ, టాబ్లెట్లు వేసుకుంటూ రోజువారీ పనుల్లో మునిగిపోతుంటారు. కానీ అధిక రక్తపోటు అనేది కేవలం ఒక సాధారణ సమస్య మాత్రమే కాదని.. శరీరంలో నిశ్శబ్దంగా వృద్ధి చెందుతున్న మూత్రపిండాల వ్యాధికి ముందస్తు హెచ్చరిక కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా పెరుగుతాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి బీపీలో వచ్చే మార్పులను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. వారి ప్రకారం..

కిడ్నీలు కేవలం వ్యర్థాలను బయటకు పంపడమే కాదు.. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతూ బీపీని నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తాయి. అయితే డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు లేదా వంశపారంపర్య సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు వాటికి రక్తప్రసరణ తగ్గుతుంది. అలాంటప్పుడు కిడ్నీలు ‘రెనిన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఉప్పు, నీరు పేరుకుపోతుంది. దీంతో బీపీ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో అకస్మాత్తుగా బీపీ పెరిగితే అది కిడ్నీ సమస్యే అని అర్థం చేసుకోవాలి. మందులు వాడుతున్నా బీపీ అదుపులోకి రాకపోవడాన్ని ‘రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్’ అంటారు. ఇది కూడా కిడ్నీ వ్యాధికి సూచన.

కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కండిషన్’ అంటారు. ఎందుకంటే ఆరంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు. వ్యాధి ముదిరే కొద్దీ కాళ్లలో వాపులు, తీవ్రమైన అలసట, శ్వాస ఆడకపోవడం, తరచూ తలనొప్పి, నిద్రలేమి, ఆకలి తగ్గడం, మూత్రంలో నురగ రావడం లేదా రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో కిడ్నీ పనితీరు పరీక్షలు (కేఎఫ్‌టీ), సీరమ్ క్రియాటినిన్ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కిడ్నీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉప్పు వాడకం తగ్గించడం, తగినంత నీరు తాగడం, బరువు అదుపులో ఉంచుకోవడం, వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్టర్ల సలహా లేకుండా సొంతంగా మందులు వాడొద్దు.
Go Back to Shorts
Kidney Disease
High Blood Pressure
Hypertension
Kidney Health
BP Control
Renin Hormone
Kidney Function Test
Chronic Kidney Disease
Silent Condition
Telangana Health

More Telugu News