ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం!

  • ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం
  • విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం
  • రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు
  • లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు
  • భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు
ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ మంచు ఖండం అంటార్కిటికా..! ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కోట్లాది సంవత్సరాల కిందట ఈ రెండు ప్రాంతాలు ఒకే భారీ భూభాగంలో భాగంగా ఉండేవని శాస్త్రవేత్తలు బలమైన ఆధారాలతో నిరూపించారు. విజయనగరం-సాలూరు ప్రాంతంలోని ప్రాచీన రాళ్లకు, తూర్పు అంటార్కిటికాలోని రేనర్ ప్రావిన్స్‌లో ఉన్న రాళ్లకు మధ్య విడదీయరాని సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ రెండు ప్రాంతాల రాళ్లు ఒకే వయస్సు, ఒకే రకమైన రసాయన లక్షణాలు, ఖనిజాలు కలిగి ఉండటమే ఇందుకు నిదర్శనం.

భారత తూర్పు తీర ప్రాంతం, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భారీ పర్వత శ్రేణిగా (రేనర్-ఈస్టర్న్ ఘాట్స్) ఉండేవని భూగర్భ శాస్త్రవేత్తలు చాలాకాలంగా భావిస్తున్నారు. ఇప్పుడు, ఏపీలోని రాళ్లపై జరిపిన పరిశోధన ఈ వాదనకు నిర్ణయాత్మక ఆధారాన్ని అందించింది. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు, ఇతర అంతర్జాతీయ సంస్థల శాస్త్రవేత్తలతో కలిసి ఈ పరిశోధన చేశారు. విజయనగరంలోని గ్రాన్యులైట్ శిలల్లోని జిర్కాన్, గార్నెట్ వంటి ఖనిజాలను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు.

ఈ రెండు ప్రాంతాల రాళ్లు మూడు ప్రధాన భౌగోళిక దశలను ఒకే విధంగా ఎదుర్కొన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 1000 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ రాళ్లు భూమి లోపల అత్యధిక ఉష్ణోగ్రతకు గురై ఒక మహా పర్వత శ్రేణిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 950-890 మిలియన్ సంవత్సరాల క్రితం మరోసారి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి.

ఇక 570-540 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా మహా ఖండం ఏర్పడే సమయంలో రసాయన మార్పులు జరిగాయి. సరిగ్గా ఇదే రకమైన భౌగోళిక చరిత్ర అంటార్కిటికా రాళ్లలోనూ కనిపించింది.

సుమారు 130-150 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా ఖండం విడిపోయినప్పుడు, భారతదేశం ఉత్తరం వైపు, అంటార్కిటికా దక్షిణ ధ్రువం వైపు కదిలిపోయాయి. మధ్యలో హిందూ మహాసముద్రం ఏర్పడింది. వేల కిలోమీటర్ల దూరం వీటిని వేరు చేస్తున్నా, అక్కడి రాళ్లు, ఇక్కడి రాళ్లు తమ ప్రాచీన బంధాన్ని ఇంకా దాచుకున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ అధ్యయనం భూమి చరిత్రను, వనరుల నిర్వహణను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.



Andhra Pradesh
Antarctica
Rayner Province
Eastern Ghats
Gondwana
Vijayanagaram
Geology
Continental Drift
Rock Analysis
Earth History

More Telugu News