ఎబోలా కలకలం.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

  • ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిపై హెల్త్ ఎమర్జెన్సీ  
  • ఇప్పటివరకు 88 మంది మృతి 
  • ఈ వైరస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు
  • సరిహద్దులు మూసివేయొద్దని WHO సూచన
కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆదివారం అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత కేసులు, 88 మరణాలు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితి కొవిడ్-19 లాంటి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రస్తుత ఉద్ధృతికి ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వైరస్ వేరియంట్‌ కారణమని అధికారులు గుర్తించారు. 

ఈ అరుదైన వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు లేదా వ్యాక్సిన్లు లేవు. కాంగో, ఉగాండాల్లో గతంలోనూ ఎబోలా వ్యాపించింది. అయితే ‘బుండిబుగ్యో’ వేరియంట్‌ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే వేరియంట్‌ తొలిసారి 2007-2008లో ఉగాండాలో కనిపించింది. అప్పట్లో ఈ వైరస్ బారిన పడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి 2012లో కాంగోలోని ఇసిరోలో 29 మంది మరణించారు.

WHO
Ebola
Global Health Emergency
Congo
Uganda
Tedros Adhanom Ghebreyesus
Bundibugyo
Ebola Virus

More Telugu News