మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు... చంద్రబాబు బంపర్ ఆఫర్

  • పిల్లలే సంపద' పేరుతో జనాభా పెరుగుదలకు ఏపీ సర్కార్ కొత్త పథకం
  • జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న సీఎం చంద్రబాబు
  • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
  • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముఖ్యమంత్రి ప్రకటన
జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 'పిల్లలే సంపద' పేరుతో త్వరలోనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జనాభా తగ్గుదల రేటు ఆందోళన కలిగిస్తోందని, దేశ ప్రగతికి పిల్లలే అసలైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చాలా దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆయన గుర్తుచేశారు.

గతంలో కుటుంబ నియంత్రణపై దృష్టి సారించామని, కానీ మారిన పరిస్థితుల్లో జనాభాను దేశానికి సంపదగా మార్చేందుకు 'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ'ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ద్వారా జననాల రేటును పెంచేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పటికే 'తల్లికి వందనం' కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, తల్లీబిడ్డలకు పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Population Growth
Birth Rate
Incentives
Government Scheme
Children are Wealth
Population Management Policy
Financial Assistance

More Telugu News