'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం
- వచ్చే నెల విడుదల కాబోతున్న 'జన నాయగన్'
- సినిమా టైటిల్స్ లో ముఖ్యమంత్రి విజయ్ అని వేయాలని భావించిన చిత్ర బృందం
- దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ముందే తెరకెక్కిన ఈ చిత్రం, రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నందున, 'జన నాయగన్' సినిమాలో ఆయన పేరుకు ముందు ఎప్పటి నుంచో వస్తున్న 'దళపతి' అనే బిరుదుకు బదులుగా 'ముఖ్యమంత్రి విజయ్' అని వేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను సీఎం విజయ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో తనను అంతటి వాడిని చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు గౌరవమిస్తూ.. ఎప్పటిలాగే 'దళపతి' అనే ట్యాగ్ లైన్‌నే కొనసాగించాలని ఆయన నిర్మాతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
రాజకీయ హోదాను దృష్టిలో ఉంచుకుని సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సీన్లను లేదా కొన్ని డైలాగులను మార్చాలని మొదట అనుకున్నప్పటికీ, కథా గమనం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆ మార్పులు కూడా వద్దని విజయ్ వారించినట్లు సమాచారం. దీంతో ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్, సోషల్ మీడియా సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. పొలిటికల్ ఇమేజ్ కోసం కాకుండా, సినిమాను సినిమాగా మాత్రమే చూడాలనే ఆయన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.