అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు: రఘునందన్ రావు

  • అసెంబ్లీలో మరోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఉదయనిధి
  • ఉదయనిధి అనుచిత వ్యాఖ్యల వల్లే డీఎంకేని ప్రజలు ఓడించారన్న రఘునందన్
  • సనాతన ధర్మాన్ని విమర్శించడాన్ని మానుకోవాలని హితవు

ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రసంగించిన డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, తన పాత వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న తన నినాదాన్ని ఆయన మళ్లీ లేవనెత్తారు. అయితే, ఇదే సమయంలో ఆయన రాజకీయ పరిణతిని కూడా ప్రదర్శించారు. కొత్త ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే, సభలో అధికార, ప్రతిపక్షాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ తమిళనాడు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, సభలో రాజకీయ మర్యాదలు కొనసాగాలని కోరారు.


మరోవైపు సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అధికారం కోల్పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రజలు డీఎంకేని తిరస్కరించారని రఘునందన్ గుర్తుచేశారు. అందరి మంచిని కోరుకునే ధర్మమే సనాతన ధర్మమని చెప్పారు. సర్వజనుల శ్రేయస్సును కోరే సనాతన ధర్మాన్ని విమర్శించడం మానుకోవాలని, హిందూ సంప్రదాయాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఉదయనిధికి సూచించారు. రఘునందన్ రావు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఉదయనిధిపై విమర్శలు గుప్పించారు.

Udhayanidhi Stalin
Sanatana Dharma
Tamil Nadu
Raghunandan Rao
DMK
BJP
Politics
Hinduism
Tirumala
Vijay

More Telugu News