పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం!

Pakistan Secretly Sheltered Iranian Warplanes Report
  • అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి
  • రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాల పార్కింగ్
  • ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్
  • ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్
  • జనసాంద్రత ఉన్న చోట ఇది సాధ్యం కాదని వాదన
అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్యకు మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్థాన్, తెరవెనుక ఇరాన్‌కు రహస్యంగా సహకారం అందించిందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు చెందిన పలు సైనిక విమానాలను తమ దేశంలోని కీలక ఎయిర్‌బేస్‌లో పార్క్ చేయడానికి పాకిస్థాన్ అనుమతించినట్టు అమెరికన్ అధికారులు వెల్లడించారు.  

 ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఇరాన్ తన సైనిక విమానాలను రావల్పిండి సమీపంలోని పాకిస్థాన్ వాయుసేనకు చెందిన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు తరలించింది. వీటిలో ఇరాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన RC-130 నిఘా విమానం కూడా ఉన్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా దాడుల నుంచి తమ విమాన ఆస్తులను కాపాడుకునే వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఈ చర్య తీసుకున్నట్టు భావిస్తున్నారు.

ఈ నివేదికపై యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సి ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఓ పాకిస్థాన్ సీనియర్ అధికారి ఖండించారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఉందని, అలాంటి చోట సైనిక విమానాలను రహస్యంగా ఉంచడం అసాధ్యమని అన్నారు.

ఇదే సమయంలో ఇరాన్ కొన్ని పౌర విమానాలను పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌కు తరలించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఒకవైపు అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్, చైనాలను దూరం చేసుకోకుండా పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఈ సంఘటనతో మరోసారి బయటపడింది.
Go Back to Shorts
Pakistan
Iran military
US Iran relations
Noor Khan Airbase
Rawalpindi
Afghanistan
Lindsay Graham
Pakistan double game
Iran warplanes
American officials

More Telugu News