ఐపీఎల్ నుంచి ముంబై అవుట్.. థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం

  • ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమణ
  • ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
  • 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కృనాల్ పాండ్యా
  • ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్
  • ఓటమి జీర్ణించుకోలేకపోతున్నామన్న ముంబై కెప్టెన్ సూర్యకుమార్
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ప్రస్థానం ముగిసింది. రాయ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఆఖరి బంతికి రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కృనాల్ పాండ్యా (73) వీరోచిత ఇన్నింగ్స్, భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాయి.

167 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి కెప్టెన్ రజత్ పటిదార్‌తో సహా మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ 47/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా, కండరాల నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా పట్టుదలగా ఆడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు.

అయితే ముంబై బౌలర్ కార్బిన్ బాష్ (4/26) అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. రాజ్ బావా వేసిన ఈ ఓవర్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఒక వైడ్, ఒక నోబాల్ వేయగా.. రొమారియో షెపర్డ్ ఔటయ్యాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన సిక్సర్ బాది సమీకరణాలను మార్చేశాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, రసిఖ్ సలామ్ దార్ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (4/23) తన పదునైన బౌలింగ్‌తో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌తో సహా ముంబై టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అయితే, తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు."బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశాం. తిలక్, నమన్ అద్భుతంగా పోరాడారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని వచ్చే ఏడాది బలంగా పుంజుకుంటాం" అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.

Suryakumar Yadav
Mumbai Indians
RCB
Royal Challengers Bangalore
IPL 2024
Krunal Pandya
Bhuvneshwar Kumar
Rohit Sharma
Tilak Varma
Cricket

More Telugu News