తమిళనాడు సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు

Vijay Congratulated by Revanth Reddy and Manchu Vishnu
  • పేదల సంక్షేమం కోసం పని చేస్తారని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
  • విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్
  • శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, సిమ్రాన్, విశాల్ తదితరులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ పేదల సంక్షేమం కోసం పని చేస్తారని, అందరికీ న్యాయం చేస్తారని ఆకాంక్షించారు. తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకువెళతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి శుభాకాంక్షలు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. తమిళనాడు రాష్ట్ర పురోగతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విజయ్ పదవీకాలం ఫలవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

విజయ్‌కి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు విశాల్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, భవిష్యత్తులో మంత్రులు కాబోయే వారికి ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. విజయ్ పాలనలో మన రాష్ట్రం స్వర్ణయుగం కావాలని ఆకాంక్షించారు. 32 ఏళ్లుగా తనకు తెలిసిన వ్యక్తిని, దళపతి విజయ్ అని పిలుచుకునే వ్యక్తిని ఇప్పుడు 'సర్' అనడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

డియర్ ఫ్రెండ్, పీపుల్స్ లీడర్, నిజమైన జననాయగన్‌కు అభినందనలు అంటూ సిమ్రాన్ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఒక నటుడు తమిళనాడు లాంటి గొప్ప రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి చేరుకోవడం చిత్ర పరిశ్రమకు గర్వకారణమని నటుడు మోహన్ బాబు అన్నారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని కమల్ హాసన్ పేర్కొన్నారు.

ఎంతటి ప్రయాణం, ఎంతటి రాజకీయ నాటకం, చివరకు చారిత్రక ముగింపు అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. విజయ్ తమిళనాడు ప్రజల్లో మార్పు తీసుకు వస్తారని ఆకాంక్షించారు. కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని విశ్వసించారని పేర్కొన్నారు. ఇప్పుడు చరిత్ర మిమ్మల్ని చూస్తోంది, ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu CM
Revanth Reddy
Manchu Vishnu
Tamil Nadu Politics
Rajinath Singh
Rahul Gandhi

More Telugu News