మెట్ గాలాలో సింపుల్ డ్రెస్... భారతీయ మోడల్ భవితా మండవపై భారీ ట్రోలింగ్

Bhavita Mandava Trolled for Simple Dress at Met Gala
  • మెట్ గాలాలో భవిత మండవ 'జీన్స్ అండ్ టాప్' లుక్‌పై తీవ్ర వివాదం
  • భారత అంబాసడర్‌కు సాధారణ డ్రెస్ అంటూ ఛానెల్‌పై విమర్శలు
  • లుక్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను సమర్థించిన మరో వర్గం
  • విమర్శల మధ్య క్రియేటివ్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిత పోస్ట్
  • నా ప్రయాణంపై నమ్మకముంచారంటూ మాథ్యూ బ్లేజీకి ధన్యవాదాలు
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మెట్ గాలా 2026 వేదికపై భారతీయ మోడల్ భవితా మండవ ధరించిన ఓ సాధారణ 'జీన్స్ అండ్ టాప్' లుక్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 'షేనెల్' సంస్థ మొదటి భారతీయ హౌస్ అంబాసడర్‌గా హాజరైన ఆమెకు ఇంత సింపుల్ దుస్తులు డిజైన్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే, భవిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'షేనెల్' క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై భవిత ధరించిన లుక్ చూడటానికి చాలా సాధారణంగా ఉంది. ఆమె షీర్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్, దానికి జతగా వాష్డ్-అవుట్ డెనిమ్ తరహాలో కనిపించే సిల్క్ ట్రౌజర్స్, వైట్ హీల్స్ ధరించి కనిపించారు. అయితే ఈ లుక్ వెనుక ఓ ప్రత్యేకమైన కథ ఉంది. 2024లో న్యూయార్క్ సబ్‌వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆమెను 'షేనెల్' తొలిసారి గుర్తించింది. అప్పుడు ఆమె ధరించిన దుస్తులనే స్ఫూర్తిగా తీసుకుని, ఆమె ప్రయాణానికి గుర్తుగా 'ఫుల్ సర్కిల్ మూమెంట్' అనే కాన్సెప్ట్‌తో మాథ్యూ బ్లేజీ దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

అయితే, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోని పలువురు సోషల్ మీడియాలో ఛానెల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారతీయ అంబాసడర్‌కు ఇంత సాధారణ దుస్తులు ఇవ్వడమేంటి?" అని ప్రశ్నిస్తూ, ఇది జాతి వివక్ష, టోకనిజం (పైకి సమానత్వం పాటిస్తున్నామని చెబుతూ, లోలోపల పక్షపాత ధోరణి అనుసరించడం) వంటి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో వర్గం ఈ లుక్‌ను గట్టిగా సమర్థించింది. "కౌచర్ డెనిమ్‌లో దాగివున్న నైపుణ్యం, దాని వెనుక ఉన్న కథ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్' అనే థీమ్‌కు సరిగ్గా సరిపోతుంది" అని ప్రశంసించారు.

ఈ వివాదాల నడుమ, భవితా మండవ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. మార్గో రాబీ, జెన్నీ వంటి ప్రముఖులతో దిగిన ఫోటోలు పంచుకుంటూ, తన అనుభవాన్ని వివరించారు. ముఖ్యంగా మాథ్యూ బ్లేజీని ఉద్దేశిస్తూ, "హీల్స్‌లో నడవడం నేర్చుకోవడం దగ్గరి నుంచి మెట్ గాలా మెట్లు ఎక్కే అవకాశం ఇవ్వడం వరకు.. నా ప్రయాణంలో నమ్మకం ఉంచారు. ఎప్పుడూ ఆదరించారు. మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు మాథ్యూ బ్లేజీ" అని ఎమోషనల్ క్యాప్షన్ రాశారు. 

దీంతో పాటు అన్నా వింటూర్, వోగ్ టీమ్‌కు, ఈ లుక్ వెనుక పనిచేసిన కళాకారులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. వివాదాలను పక్కనపెట్టి, తన ప్రయాణానికి తోడ్పడిన వారికి ఆమె చూపిన ఈ కృతజ్ఞతాభావం అందరినీ ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Bhavita Mandava
Met Gala 2026
Indian Model
Chanel
Matthieu Blazy
Fashion
Red Carpet
Social Media Trolling
Vogue
Anna Wintour

More Telugu News