ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ ఇక 24 గంటల్లోనే.. ఆలస్యమైతే ఆటో అప్రూవల్!

  • రిజిస్ట్రేషన్ల జాప్యంపై చంద్రబాబు ఆదేశాలతో కొత్త విధానం
  • ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 27 వేల రిజిస్ట్రేషన్లు
  • త్వరలో ప్రభుత్వ ఆమోదంతో అమల్లోకి రానున్న కొత్త రూల్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ మేరకు రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ఈ వారంలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

వాహనాల రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న జాప్యంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో రవాణా శాఖ ఈ కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి.

కొత్త విధానం ప్రకారం డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను ఆమోదించాలి. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ అధికారులు గడువులోగా ఆమోదం తెలపడంలో విఫలమైతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌కు ఆమోదం తెలుపుతుంది. సెలవు రోజుల్లో కూడా అధికారులు ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

తొలుత శాశ్వత రిజిస్ట్రేషన్ అధికారాన్ని డీలర్లకే అప్పగించాలని సీఎం సూచించినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు రావొచ్చని అధికారులు వివరించారు. దీంతో రిజిస్ట్రేషన్ అధికారాన్ని రవాణా శాఖ వద్దే ఉంచి, 24 గంటల కాలపరిమితితో కూడిన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ దస్త్రం ప్రభుత్వ ఆమోదం పొందగానే కొత్త విధానం అమల్లోకి రానుంది.

Chandrababu Naidu
Andhra Pradesh
Vehicle Registration
AP Transport Department
Auto Approval
New Vehicle Registration
Vehicle Registration Process
AP Government
RTA Andhra Pradesh

More Telugu News