నేను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదు... అందుకే టాప్ హీరో!: సీనియర్ నటుడు శివకృష్ణ

Sivakrishna Comments on Chiranjeevis Success Compared to His Own
  • కెరీర్ మొదట్లో చిరంజీవి కన్నా తనకే ఎక్కువ హిట్స్ ఉన్నాయన్న శివకృష్ణ
  • తాను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదని వ్యాఖ్య
  • అవకాశాలు అడగకపోవడం తన తప్పేనని అంగీకారం
  • చిరంజీవి కీలక నిర్ణయాల వల్లే నంబర్ వన్ హీరో అయ్యారన్న శివకృష్ణ
  • సీనియర్ నటుడి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చ
సీనియర్ నటుడు శివకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన కెరీర్ ఆరంభంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ తనకే ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన తన కెరీర్ తొలినాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

"మా కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. అది నిజం" అని శివకృష్ణ స్పష్టం చేశారు. 1970ల చివర్లో తాము ఇద్దరం పరిశ్రమలోకి అడుగుపెట్టామని, అయితే హీరోగా తనకు త్వరగా వరుస విజయాలు వచ్చాయని తెలిపారు. అదే సమయంలో చిరంజీవి చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడని వివరించారు.

అయితే, చిరంజీవి నంబర్ వన్ హీరోగా ఎదగడానికి గల కారణాలను కూడా శివకృష్ణ నిజాయతీగా విశ్లేషించారు. "నేను ఎప్పుడూ నిర్మాతలను అవకాశాలు అడగలేదు. చాలా పాత్రలను తిరస్కరించాను. అది నా తప్పు. కానీ నేను చేసిన తప్పులు చిరంజీవి చేయలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. అందుకే అతను నంబర్ వన్ హీరో అయ్యాడు" అని అంగీకరించారు.

తొలినాళ్లలో వాణిజ్య సినిమాల ప్రాముఖ్యతను తాను గుర్తించలేకపోయానని, పరిశ్రమకు చిరంజీవి లాంటి స్టార్ల అవసరం ఉందని శివకృష్ణ అంగీకరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా అభిమానుల మధ్య కొత్త చర్చకు దారితీశాయి. కొందరు శివకృష్ణ నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ పోలిక అనవసరం అని అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Sivakrishna
Chiranjeevi
Telugu cinema
Tollywood
actor
interview
hits and flops
career comparison
number one hero
film industry

More Telugu News