పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!

Pawan Kalyan Initiates TTD Funds for Varthanapalli Shiva Temple
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో శివాలయ పునర్నిర్మాణం
  • వర్తనపల్లి ఆలయానికి రూ. 55 లక్షలు మంజూరు చేసిన టీటీడీ
  • పాడేరు పర్యటనలో గ్రామస్థులకు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
  • ఆలయంతో పాటు కొత్త విగ్రహాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రణాళిక 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శిథిలావస్థకు చేరిన శివాలయానికి మహర్దశ పట్టనుంది. పాడేరు నియోజకవర్గంలోని వర్తనపల్లి గ్రామ శివాలయం పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ. 55 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 14న పవన్ కల్యాణ్ పాడేరు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్తనపల్లి గ్రామస్థుల కోరిక మేరకు, సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించి శిథిలావస్థకు చేరిన శివాలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని గ్రామస్థులు కోరగా, టీటీడీ సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన అక్కడికక్కడే హామీ ఇచ్చారు.

పర్యటన ముగిసిన వెంటనే పవన్ కల్యాణ్ ఈ విషయంపై టీటీడీకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తి మేరకు టీటీడీ సాంకేతిక బృందం గ్రామంలో పర్యటించి అంచనాలు రూపొందించింది. ఈ నిధులతో శివాలయ పునర్నిర్మాణంతో పాటు సింహవాహనంతో కూడిన అమ్మవారి విగ్రహం, మూషిక వాహనంతో గణపతి, నెమలి వాహనంతో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ధ్వజస్తంభం, భక్తులకు బెంచీలు, బోర్ వెల్ తో కూడిన తాగునీటి సౌకర్యం, మైక్ సిస్టమ్ వంటివి కూడా కల్పించనున్నారు.

ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులకు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Go Back to Shorts
Pawan Kalyan
Varthanapalli
Sivalayam
TTD
Alluri Sitarama Raju district
Temple Renovation
Andhra Pradesh
Chandrababu Naidu
Bollineni R. Naidu
Paderu

More Telugu News