మా సొంత వాహనాల్లోనే వెళుతున్నాం, మా డబ్బుతోనే పర్యటిస్తున్నాం: నారా లోకేష్
- టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమం
- హాజరైన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
- ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
- పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు.. పనిచేయకపోతే వేటేనని హెచ్చరిక
- అహంకారం వీడి ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తామన్న లోకేష్
- కేడర్‌పై పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగిస్తామని భరోసా
ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో నిర్వహించిన 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో లోకేష్ పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలు అహంకారం ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. "గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి గొడ్డలి పార్టీ వారి అహంకారమే కారణం. మనం ఆ తప్పు చేయకూడదు. అహంకారం వీడి, సత్ప్రవర్తనతో, మంచి మాటలతో ప్రజల మనసులు గెలవాలి. అప్పుడు ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారు" అని హితవు పలికారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని లోకేష్ అన్నారు. "దేశంలోనే రూ.4 వేల పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 'తల్లికి వందనం' కింద విద్యార్థులకు రూ.15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. పోలవరం పూర్తికావొస్తోంది, అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు రాష్ట్రానికి చాలా అవసరం" అని ఆయన వివరించారు.
పార్టీలో పనితీరే కొలమానమని, ప్రతి నాయకుడి పనితీరును అధినేత చంద్రబాబు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తారని లోకేష్ హెచ్చరించారు. "పనిచేయని వారి పదవులు ఊడతాయని చంద్రబాబు గారు మాతో నిర్మొహమాటంగా చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుని పనిచేయాలి. పార్టీలో ఇప్పుడు కోటరీలు లేవు. సామాన్య కార్యకర్త సైతం నేరుగా అధినేతను కలిసే అవకాశం ఉంది" అని తెలిపారు.
పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపైనే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. "తెలుగుదేశంలో వ్యక్తులు కాదు, పార్టీయే శాశ్వతం. నాయకుల మధ్య విభేదాల వల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుంది" అని అన్నారు. 2027 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, కేడర్‌పై పెట్టిన అక్రమ కేసులను పూర్తిగా తొలగిస్తామని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. బీజేపీ వంటి పార్టీలు దీర్ఘకాలం అధికారంలో కొనసాగేందుకు అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నామని, పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

