అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం: పెమ్మసాని
- సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని, నారాయణ, సీఆర్డీఏ కొత్త కమిషనర్
- అమరావతి గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న పెమ్మసాని
రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు, ఇతర అనివార్య కారణాల వల్ల ఈ భేటీ కొంత ఆలస్యమైందని తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుతో కలిసి రాజధాని గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు.
ముఖ్యంగా ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు, ఎఫ్‌ఎస్‌ఐ అంశాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి నారాయణతో పాటు కమిషనర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ... రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు మరియు పార్కుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించామని చెప్పారు. పాలసీ ప్రకారమే పనులు జరుగుతాయని, ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద ఆర్-5 జోన్‌ను ఇప్పటికే వెనక్కి తీసుకున్నామని, హైటెన్షన్ విద్యుత్ లైన్ల రీ-రూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఈ నెలాఖరు నాటికి దాదాపు 60 శాతం భూ సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు కౌలు పెంపు వంటి కీలక అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు.