మమత, స్టాలిన్ ఓటమిపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
- ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా భారీగా ముస్లిం ఓట్లు తొలగించారన్న ఒవైసీ
- బెంగాల్లో 31 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న ఎంఐఎం అధినేత
- ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమిపాలయ్యాయని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ద్వారా భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరగడం వల్లే ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సుమారు 31 లక్షల మంది ముస్లిం ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని, ఇది మమతా బెనర్జీపై తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్ నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో ఓట్లు తొలగించారని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడులో కూడా ఇదే వ్యూహం అమలు జరిగిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో ఓడిపోవడానికి ఓటర్ల గల్లంతు కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు. కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. ఈ 'ఎస్ఐఆర్' ప్రక్రియపై ప్రతిపక్షాలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని, బీజేపీ విజయం వెనుక ఇటువంటి సాంకేతిక వ్యూహాలు ఉన్నాయని ఒవైసీ ఈ సందర్భంగా విమర్శించారు.