పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచిన బాబర్.. రోహిత్ శర్మలా నడిచిన వైనం.. ఇదిగో వీడియో!

  • పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న పెషావర్ జల్మీ
  • ఫైనల్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం
  • ట్రోఫీ అందుకునే క్రమంలో రోహిత్ శర్మ స్లో-వాక్‌ను అనుకరించిన కెప్టెన్ బాబర్ ఆజం
  • బాబర్ నడకపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్టివల్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో కెప్టెన్‌గా పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ ఆజం టైటిల్ అందించాడు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై పెషావర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ గెలుపు కన్నా ఒక సరదా కారణంతో బాబర్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించి అతను సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాడు.

మ్యాచ్ అనంతరం విజయోత్సవ వేడుకల్లో భాగంగా ట్రోఫీని అందుకునేందుకు బాబర్‌ను వేదికపైకి పిలిచారు. ఆ సమయంలో అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐకానిక్ స్లో-వాక్ పోజును అనుకరించాడు. కావాలనే అతి నెమ్మదిగా నడుస్తూ రోహిత్‌ను ఇమిటేట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు క్షణాల్లో వైరల్ అవ్వగా, సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే, ఫైనల్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పెషావర్ జల్మీ అద్భుతంగా రాణించింది. ఆరోన్ హార్డీ నాలుగు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు 129 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 130 పరుగుల లక్ష్య ఛేదనలో పెషావర్ జట్టు 15.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. హార్డీ అజేయంగా 56 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 48 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ గెలిచిన అనంతరం బాబర్ మాట్లాడుతూ.. "ఈ విజయం నాకు, పెషావర్ జల్మీ జట్టుకు, మా అభిమానులకు చాలా గొప్పది. టోర్నమెంట్ ఆద్యంతం మా జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. ప్రతి ఆటగాడు తమకు ఇచ్చిన ప్రణాళికను సరిగ్గా అమలు చేశారు. ప్ర‌తి మ్యాచ్‌కూ ప‌క్కా ప్రణాళికతో ముందుకు సాగాం. దేవుడి దయతో ఫైనల్ గెలిచాం. మా యాజమాన్యం కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చింది" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు.

Babar Azam
PSL Trophy
Peshawar Zalmi
Rohit Sharma
Pakistan Super League
Cricket
Viral Video
Hyderabad Kingsmen
Aaron Hardy
Gaddafi Stadium

More Telugu News