నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి అడిగింది: రాజశేఖర్
- కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ కు ప్రపోజ్ చేసిన శ్రీదేవి!
- తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవన్న రాజశేఖర్
- సొంత కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉండేదని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన వివాహ బంధం వెనుక ఉన్న తెలియని కోణాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కెరీర్ ప్రారంభంలో అగ్ర కథానాయిక శ్రీదేవి తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. అయితే, అప్పట్లో తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండటంతో సొంత కులం అమ్మాయినే చేసుకోవాలని తనపై తీవ్ర ఒత్తిడి ఉండేదని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన మనసులోని మాటను నటి జీవిత వద్ద ప్రస్తావించగా, ఆమె ఇచ్చిన సమాధానం తనను కదిలించిందని చెప్పారు.
"నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకో.. కానీ నేను మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను" అని జీవిత చెప్పిందని... దీంతో, ఆమెపై గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి జీవితను రాజశేఖర్ జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఈ జంట టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా కొనసాగుతుండటం విశేషం.