వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట!

  • ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టం ఉల్లంఘనేనని ఆరోపణ
  • 15 ఏళ్ల వైభవ్‌ను జట్టు నుంచి తొలగించాలని రాజస్థాన్ రాయల్స్‌‌ను డిమాండ్ చేసిన కార్యకర్త
  • క్రీడలు, వినోద రంగానికి బాల కార్మిక చట్టం నుంచి కొన్ని మినహాయింపులు
  • ఆరోపణలపై అధికారికంగా స్పందించని రాజస్థాన్ రాయల్స్, బీసీసీఐ
ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల యువ కెరటం, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కొత్త వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతడిని ఐపీఎల్‌లో ఆడించడం బాల కార్మిక చట్టం (చైల్డ్ లేబర్ యాక్ట్) కిందకు వస్తుందని, ఇది చట్టవిరుద్ధమని ఓ కన్నడ సామాజిక కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదాస్పదం అయింది. ఈ విషయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సామాజిక కార్యకర్త హెచ్చరించారు.

ఓ కన్నడ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న సదరు కార్యకర్త ఈ వ్యాఖ్యలు చేశారు. "చదువుకోవాల్సిన వయసులో 15 ఏళ్ల పిల్లాడితో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడించడం సరికాదు. ఇది బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే. రాజస్థాన్ రాయల్స్ వెంటనే అతడిని జట్టు నుంచి తొలగించాలి, లేకపోతే నేను కేసు ఫైల్ చేస్తాను" అని ఆయన హెచ్చరించారు.

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ జట్టులోకి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, భారత చట్టాల ప్రకారం 14-18 ఏళ్ల మధ్య వయసున్న వారిని 'అడోలెసెంట్స్'గా పరిగణిస్తారు. ప్రమాదకరం కాని క్రీడలు, వినోద రంగాల్లో కొన్ని షరతులతో పనిచేయడానికి అనుమతి ఉంది. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగానే వైభవ్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.

ప్రస్తుతం ఈ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ, బీసీసీఐ గానీ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ సదరు కార్యకర్త ఫిర్యాదు చేస్తే ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
 

Vaibhav Suryavanshi
IPL 2026
Rajasthan Royals
Child Labor Act
BCCI
Cricket
Sports Law
Indian Law
Adolescent Labor

More Telugu News