ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
- షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన కర్నూలుకు చెందిన చందు
- ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దక్కని ఫలితం
- ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య
అమెరికాలో కర్నూలు యువకుడు చందు ఆత్మహత్య చేసుకున్న వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో, ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలచివేస్తోంది.
కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులు, హెచ్-1బి వీసా నిబంధనల మార్పుల వల్ల కొత్తగా చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు రావడం సవాలుగా మారింది. చందు కూడా గత కొంతకాలంగా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.
తన ఖర్చుల కోసం మళ్ళీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోందన్న భావన అతనిని మరింత కృంగదీసింది. ఆ ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన తట్టుకోలేక ఏప్రిల్ 28న తన గదిలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చందు మరణవార్తతో అతని స్వస్థలం కర్నూలులో విషాద ఛాయలు అలముకున్నాయి. తానా టీం స్క్వేర్ కో-చైర్ చిరంజీవి గల్లా, ఇతర ప్రవాస తెలుగు సంఘాలు చందు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.