ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకే ప్రాధాన్యమా?: షర్మిల

YS Sharmila slams AP Govt over fuel crisis
  • రాష్ట్రంలో ఇంధన కొరతపై ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు
  • ప్రజలు, రైతులను కాదని కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ
  • అమరావతి కాంట్రాక్టర్ల కోసం డీజిల్ కోరడాన్ని తప్పుబట్టిన షర్మిల
  • ముందు ప్రజలకు ఇంధనం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్
  • ప్రజల కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆమె ఆరోపించారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "డీజిల్ కోసం రైతులు, పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, కాంట్రాక్టర్ల గురించి మాట్లాడటం ఏంటి?" అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలని కోరడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు.

"రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా? ఇది పాలన కాదు.. పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం" అని షర్మిల దుయ్యబట్టారు. ముందుగా రైతులకు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా జరిగేలా చూడాలని, ఆ తర్వాతే కాంట్రాక్టర్ల గురించి ఆలోచించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమిస్తే, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని షర్మిల హెచ్చరించారు.
Go Back to Shorts
YS Sharmila
Fuel Crisis
TDP
Congress
Andhra Pradesh

More Telugu News