'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్

  • నావికా దిగ్బంధనాన్ని 'జీనియస్', 'ఫూల్‌ప్రూఫ్' అని వర్ణన
  • దిగ్బంధనం కొనసాగితే సైనిక చర్య తప్పదని ఇరాన్ హెచ్చరిక
  • అంతర్జాతీయంగా 120 డాలర్లకు పెరిగిన ముడిచమురు ధరలు
ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదిలిపెడితే తప్ప ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని స్పష్టం చేశారు. అప్పటివరకు చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇరాన్‌పై ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఆయన 'జీనియస్', '100 శాతం ఫూల్‌ప్రూఫ్' అని అభివర్ణించారు. అమెరికా నౌకాదళం సత్తాకు ఇది నిదర్శనమని అన్నారు. "ఈ దిగ్బంధనం బాంబు దాడుల కన్నా ప్రభావవంతమైనది. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు" అని ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు ప్రస్తుతం నేరుగా కాకుండా 'టెలిఫోనిక్‌గా' జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రతిష్టంభనపై ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

మరోవైపు, అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దిగ్బంధనాన్ని కొనసాగిస్తే 'అపూర్వమైన సైనిక చర్య' తప్పదని హెచ్చరించింది. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు సంయమనం పాటిస్తున్నామని పేర్కొంది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్ల పైకి చేరింది. అమెరికాలో గ్యాస్ ధరలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి.
Go Back to Shorts

More Telugu News