కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి
- కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడం వల్ల బయటి విషయాలపై అవగాహన తగ్గుతోందన్న మల్లు రవి
- తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే తాము పార్లమెంటులోనే నిరసన తెలిపామని వెల్లడి
- కాంగ్రెస్ నేతలపై బురదజల్లడం కేసీఆర్ మానుకోవాలని హితవు
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కేసీఆర్ మాట్లాడటం సరికాదని మల్లు రవి హితవు పలికారు. కేసీఆర్ ఎక్కువగా ఫాంహౌస్‌కే పరిమితం కావడం వల్ల బయటి విషయాలపై ఆయనకు అవగాహన తగ్గుతోందని విమర్శించారు. ముఖ్యంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారన్న కేసీఆర్ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే తాము పార్లమెంటులోనే నిరసన తెలిపామని, ఆయన క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశామని మల్లు రవి గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కాంగ్రెస్ నేతలపై బురదజల్లడం కేసీఆర్ మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందని, కానీ కేసీఆర్ మాత్రం తన రాజకీయ ఉనికి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.