'సారు బయటకు రారు' అని కవితనే చెప్పారు: ప్రభుత్వ విప్

Gov Whip Adi Srinivas lashes out at KCR
  • కూతురు కవిత విమర్శకు కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీత
  • ఏ రైతునూ కలవని కేసీఆర్ వారు ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పడమేమిటని ప్రశ్న
  • బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో వారు సమీక్షించుకోవడం లేదన్న ఆది శ్రీనివాస్
"సారు బయటకు రారు, ఎవరినీ కలవరు" అని స్వయంగా కేసీఆర్ కూతురు, తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత తన తండ్రిపై విమర్శలు చేశారని, ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఏ రైతునూ కలవని కేసీఆర్, వారు ఇబ్బందుల్లో ఉన్నట్లు చెబుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని ఆరోపించారు. తెలంగాణలోని రైతులను పట్టించుకోని కేసీఆర్, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు ఇచ్చారని కవిత చెప్పారని, ఆమె వ్యాఖ్యలకు సమాధానం చెప్పని కేసీఆర్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడమేమిటని అన్నారు. రైతుల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.2,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.

వరిసాగులో తెలంగాణ ఇప్పుడు పంజాబ్‌ను అధిగమించిందని, ఈ సీజన్‌లో కూడా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ధాన్యానికి బోనస్ రూ.3 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు. వరికి బోనస్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్‌కు ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క రైతుబంధును అమలు చేసి అన్ని పథకాలను నిలిపివేశారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించడం లేదని విమర్శించారు. ఆ పార్టీ నేతల అహంకార ధోరణిని ప్రజలు తప్పుపడుతున్నారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Whip Adi Srinivas
Adi Srinivas on KCR
Srinivas on Kavitha comments

More Telugu News