పాక్‌లో ఉగ్రవాదులకు మృత్యుఘంటికలు... కాల్చేస్తారు, మాయమవుతారు... ఎవరు వాళ్లు?

Terrorists gunned down in Pakistan by unknown armed men
  • పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తున్న అజ్ఞాత శక్తులు
  • లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు షేక్ అఫ్రిది తాజాగా హత్య
  • నాయకత్వ సంక్షోభం, క్యాడర్‌లో అభద్రతతో లష్కరే తైబా బలహీనం
  • భారత్‌పై భారీ దాడికి పాక్ కుట్ర పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక
  • పాక్ ఆర్మీ, ఐఎస్ఐపై నమ్మకం కోల్పోతున్న ఉగ్రవాద క్యాడర్
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ఎవరో వస్తున్నారు... వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు... అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతున్నారు... ఆ తర్వాత ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు! ఈ పరిణామాలు ఉగ్రవాద సంస్థలతో పాటు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల కిందట లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన షేక్ అఫ్రిదిని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడం ఈ మిస్టరీని మరింత పెంచింది. ఈ 'అజ్ఞాత హంతకులు' ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వారి లక్ష్యం ఏమిటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఈ హత్యల పరంపర కేవలం లష్కరేకే పరిమితం కాలేదు. హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల అగ్రనేతలు కూడా ఇలాగే హతమవుతున్నారు. ఒక్క 2026లోనే ఇప్పటివరకు 30 మందికి పైగా టాప్ టెర్రరిస్టులను ఈ "అజ్ఞాత శక్తులు" మట్టుబెట్టాయి. లాహోర్, పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్, కరాచీ సహా దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ హత్యలు జరగడం గమనార్హం. అత్యంత పకడ్బందీగా తమ పని పూర్తిచేసి మాయమవుతున్న ఈ కిల్లర్స్‌ను పట్టుకోవడంలో పాక్ భద్రతా ఏజెన్సీలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఓ భారత అధికారి తెలిపారు.

ఈ వరుస హత్యలు లష్కరే తోయిబాను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయని భారత నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' దెబ్బ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న లష్కరేకు ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయి. ఇప్పటికే జైషే మహమ్మద్ లాగే లష్కరే కూడా బలమైన నాయకత్వ లేమితో సతమతమవుతోంది. హఫీజ్ సయీద్‌కు వయసు మీద పడగా, మరో కీలక నేత జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ తెరమరుగయ్యాడు. దీంతో సంస్థకు సరైన ఆపరేషనల్ హెడ్ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో, కీలక కమాండర్, జమ్మూకశ్మీర్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్న షేక్ అఫ్రిది హత్య సంస్థకు కోలుకోలేని దెబ్బ. అతను కేవలం సాధారణ కార్యకర్త కాదని, సంస్థలో నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీలో సభ్యుడని, అతని మరణంతో లష్కరే నాయకత్వం మరింత కుదించుకుపోయిందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల మొదట్లో హఫీజ్ సయీద్‌కు మరో ముఖ్య అనుచరుడు, సంస్థ ఐడియలాజికల్ మెంటార్ అయిన అమీర్ హంజాపై కూడా కాల్పులు జరిగాయి. రిక్రూట్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించే హంజాపై దాడితో కొత్త నియామకాల ప్రక్రియ పూర్తిగా దెబ్బతింది. ఈ హత్యలు, దాడులతో లష్కరే క్యాడర్‌లో తీవ్ర అభద్రతాభావం, అవిశ్వాసం పెరిగిపోతున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత సైన్యం ధాటికి నిలవలేకపోయిన నాయకత్వం, ఇప్పుడు పాకిస్థాన్ గడ్డపై కూడా తమను తాము రక్షించుకోలేకపోతోందని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అగ్ర కమాండర్లకే భద్రత లేనప్పుడు తమ గ్యారెంటీ ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిణామాలు పాక్ ఆర్మీ, ఐఎస్ఐపై కూడా క్యాడర్‌కు నమ్మకాన్ని పోగొడుతున్నాయి. రిక్రూట్‌మెంట్ సమయంలో ఎన్నో హామీలిచ్చిన ఐఎస్ఐ, ఇప్పుడు తమ నేతలను కాపాడలేకపోవడంతో ఉగ్రవాదులు వారిని నిలదీస్తున్నారు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న పాక్ ఆర్మీ, ఐఎస్ఐ... లష్కరే క్యాడర్‌లో తిరిగి నమ్మకాన్ని, నైతిక స్థైర్యాన్ని నింపేందుకు భారత్‌పై ఏదైనా పెద్ద దాడికి కుట్ర పన్నే ప్రమాదం ఉందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కూడా పాకిస్థాన్ ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చని అంచనా వేస్తున్నాయి.
Go Back to Shorts
Terrorists in Pakistan
Unknown Armed Men
LeT
Hizbul Muzahiddin

More Telugu News