ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ

ap government sanctioned rs1000 crore for ntr vaidya Seva network hospitals
  • ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
  • 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల
  • ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి
  • కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్' (టీబీడీఏ) విధానంలో సుమారు రూ.1,000 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 323 ఆసుపత్రులు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకున్నాయి. బకాయిల చెల్లింపు పురోగతిపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు.

ప్రస్తుతం 873 ప్రైవేటు ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం రూ.2,044 కోట్లు బకాయి పడింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.1,000 కోట్ల బిల్లుల పరిశీలన పూర్తి చేసి, చెల్లింపులు జరుపుతోంది. ఈ విధానంలో, ప్రభుత్వం తరఫున ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్‌సీ) నిధులు చెల్లిస్తుంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో వార్షిక వడ్డీని ముందుగానే మినహాయించి, మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు మొత్తం రూ.5,556 కోట్లు చెల్లించింది. గత వైకాపా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,403 కోట్ల బకాయిలను కూడా ఇందులో భాగంగానే చెల్లించడం గమనార్హం. తాజా చెల్లింపులతో కలిపి ఆసుపత్రులకు మరింత ఊరట లభించనుంది.
Go Back to Shorts
NTR Vaidya seva
andhra pradesh
satyakumar Yadav
network hospitals

More Telugu News