శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన అధికారులు

Seshachalam Forest Fire Under Control Near Tirupati
  • జీవకోన సమీపంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం దగ్ధం
  • అదుపులోకి తెచ్చిన అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది
  • అధిక ఉష్ణోగ్రతల వల్లా?, ఆకతాయిల పనా? అనే కోణంలో అధికారుల విచారణ
  • ఎర్రచందనం గిడ్డంగులకు ముప్పు లేకుండా చర్యలు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన అటవీ రేంజ్‌లోని మొండోడికోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి ఉద్ధృతంగా మారి, నగరం నుంచి కూడా దట్టమైన పొగ, అగ్నికీలలు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ, టీటీడీ, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 50 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్‌ లైన్లు ఏర్పాటు చేసి, ఫైర్‌ బీటర్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయిందని, విలువైన వృక్షసంపద, వనమూలికలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి.

ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై జిల్లా అటవీ అధికారి వి.సాయిబాబా ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండిపోయిన గడ్డి అంటుకుందా?, లేక ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని డీఎఫ్‌వో తెలిపారు. ఎర్రచందనం గిడ్డంగులు సమీపంలో ఉండటంతో ఆ ప్రాంతానికి మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
 
Go Back to Shorts
Seshachalam Forest
Seshachalam hills fire
Tirupati forest fire
AP forest fire
wildfire
forest fire accident
fire accident
forest
V Sai Baba
fire services

More Telugu News