మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్

  • మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సరికాదన్న సీపీఐ
  • విపక్షాలను ఎండగట్టడం కాదని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
  • చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచన
  • డీలిమిటేషన్‌తో బిల్లును ముడిపెట్టి మోదీ డ్రామాలాడుతున్నారని విమర్శ
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, విపక్షాలను ఎండగడతామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.

మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాల వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంటు ఆమోదం పొందగా, ఆ బిల్లును ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు డీలిమిటేషన్‌తో ముడిపెట్టి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని రామకృష్ణ అన్నారు.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అందరూ చెబుతున్నా.. సీఎం చంద్రబాబుకు మాత్రం మోదీ, అమిత్‌షాలు ఏమి చెబితే అదే వేదవాక్కుగా కనిపించడం విచారకరమని రామకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా బిల్లు అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం కాకుండా, దాని అమలుపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Ramakrishna CPI
Chandrababu Naidu
Women Reservation Bill
Andhra Pradesh Assembly
CPI National Secretary
Amit Shah
Delimitation
Political Debate
AP Politics
Narendra Modi

More Telugu News