పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవరెడ్డి విచారణ
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై అనుచిత పోస్టులు పెట్టించిన కేసు
- 130 మంది కన్వీనర్ల ద్వారా నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహించినట్టు ఆరోపణలు
- విచారణ జరిపిన డీఎస్పీ మురళీ నాయక్ బృందం
వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించిన సజ్జల భార్గవరెడ్డి ఈరోజు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 2024 నవంబర్ 8న నమోదైన కేసులో భాగంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సైబర్ క్రైమ్ అధికారుల బృందం ఆయనను విచారించింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనేది భార్గవరెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని, దాదాపు 130 మంది కన్వీనర్ల ద్వారా ఈ నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా.. షర్మిల, సునీత, విజయమ్మ వంటి వారిపై కూడా వర్రా రవీందర్ రెడ్డి ద్వారా భార్గవరెడ్డి పోస్టులు పెట్టించారని ఫిర్యాదులు అందాయి.
2022 నుంచి జరిగిన ఈ సోషల్ మీడియా దాడులకు సంబంధించిన ఆదేశాలు ఎక్కడ నుంచి వచ్చాయి, దీని వెనుకున్న ఆర్థిక లావాదేవీలు తదితర కోణాల్లో అధికారులు భార్గవరెడ్డిని ప్రశ్నించారు.